Begin typing your search above and press return to search.

ఆక్సిజన్ కొరత .. ఒకే ఆస్పత్రిలో 74 మంది మృతి

By:  Tupaki Desk   |   14 May 2021 10:30 AM GMT
ఆక్సిజన్ కొరత .. ఒకే ఆస్పత్రిలో 74 మంది మృతి
X
గోవా రాష్ట్రంలో కరోనా మహమ్మారి బాధితుల మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో సరైన సమయానికి కరోనా బాధితులకి ఆక్సిజన్ అందకపోవడంతో కన్నుమూస్తున్నారు. గత మూడు రోజుల్లో గోవాలోని ఒకే ఆస్పత్రిలో 74 మంది ఆక్సిజన్ కొరత కారణంగా మృతి చెందారంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గోవా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో కొన్ని రోజులుగా తీవ్ర ఆక్సిజన్ కొరత నెలకొంది. సకాలంలో ఆక్సిజన్ అందక ఐసీయూలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో రోగులు మరణిస్తున్నారు. మంగళవారం నుంచి వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. మంగళవారం 26, బుధవారం 20, గురువారం 15, శుక్రవారం ఉదయం వరకు మరో 13 మంది ఆక్సిజన్ సరైన సమయానికి అందక మరణించారు.

ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతపై ఇప్పటికే బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరాను పెంచి మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గోవా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కరోనా రోగుల మరణాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి ప్రమోద్ సావంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గోవాలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా ఏప్రిల్ 30- మే 11 మధ్య 378 మంది మరణించినట్టు ప్రభుత్వం బాంబే హైకోర్టుకు గురువారం వెల్లడించింది. ఆక్సిజన్ లేకపోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయని గోవాకు ప్రతి రోజు 22 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని గోవా ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు కరోనా రోగులతో గోవా మెడికల్ కాలేజీ పూర్తిగా నిండిపోయింది. కొత్త రోగులు వస్తే వారికి చోటు లేదు. మన దేశంలో గోవాలోనే అత్యధిక కరోనా పాజిటివిటీ రేటు ఉంది. దాదాపు 48.17 శాతం వరకు పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అంటే అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.అయితే, గోవా అడ్వోకేట్ జనరల్ దేవిదాస్ పంగమ్ మాత్రం రాష్ట్రంలో ఆక్సిజన్ అందక ఎవరూ మరణించడం లేదని కోర్టుకు తెలిపారు. ఇకపై ఆక్సిజన్ అందక రోగులు చనిపోకుండా చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆస్పత్రుల్లో తగినన్నీ ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపింది.