Begin typing your search above and press return to search.

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ప్రయోగాలు ఎందుకు ఆపేశారు?

By:  Tupaki Desk   |   10 Sep 2020 8:50 AM GMT
ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ప్రయోగాలు ఎందుకు ఆపేశారు?
X
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పెట్టుకున్న ఆశలు నీరుకారే సమాచారం బయటకు వచ్చింది. మానవాళికి ముచ్చమటలు పుట్టిస్తున్న కోవిడ్ 19కు చెక్ పెట్టేందుకు సాగుతున్న పరిశోధనల్లో ఇప్పటివరకు సానుకూల ఫలితాలు వచ్చిన ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఆవాంతరం చోటు చేసుకుంది. మహమ్మారి నుంచి రక్షిస్తుందని భావించిన ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ప్రయోగ పరీక్షలో ఒక వ్యక్తి అనారోగ్యం పాలు కావటంతో తాజాగా చేస్తున్న ప్రయోగానికి బ్రేకులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ.. ఆస్ట్రాజెనెకాలు ఉమ్మడిగా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ తొలి.. రెండో దశల మానవ ప్రయోగాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో అమెరికా.. బ్రిటన్.. బ్రెజిల్.. దక్షిణాఫ్రికాలో దాదాపు 30 వేల మందిపై మూడో దశ ప్రయోగాల్ని మొదలు పెట్టేశారు. అయితే.. అనూహ్యంగా వ్యాక్సిన్ ప్రయోగించిన వారిలో ఒకరి ఆరోగ్యం క్షీణించటంతో ప్రయోగాల్ని ఆపేసినట్లుగా బ్రిటన్ లోని ఆరోగ్య వెబ్ సైట్ స్టాట్ న్యూస్ వెల్లడించటం షాకింగ్ గా మారింది.

ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై ఆస్ట్రాజెనెకా స్పందన ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇదే అంశాన్ని చూస్తే.. ప్రయోగాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒక స్వతంత్ర సంస్థ సమీక్షిస్తుందని.. ఆ తర్వాతే ప్రయోగాల మీద నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పింది. గతంలోనూ ఒకసారి టీకా ప్రయోగాల్ని తాత్కాలికంగా నిలిపేశామని సదరు సంస్థ పేర్కొంది. అయితే.. ఇదంతా మామూలేనని చెబుతున్నారు. అనారోగ్యానికి గురైన వ్యక్తి ఆరోగ్యం మెరుగైన వెంటనే మళ్లీ ప్రయోగాల్ని పునరుద్దరిస్తారని చెబుతున్నారు.

ఎందుకిలా అంటే? సదరు వ్యక్తి అనారోగ్యం దేనికి సంబంధించి? అన్న వివరాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. వ్యాక్సిన్ ప్రయోగాలు అత్యంత అప్రమత్తతతో వ్యవహారించాల్సి ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా జరిగే నష్టం ఎక్కువ. అందుకే.. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు చేస్తుంటారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. తాజాగా ఆగిన ప్రయోగంతో వ్యాక్సిన్ రాక మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న అంచనా వినిపిస్తోంది.