Begin typing your search above and press return to search.

ఈసీపై కార్టూన్ తో మంట పుట్టించిన కాంగ్రెస్‌!

By:  Tupaki Desk   |   25 Jan 2019 9:58 AM GMT
ఈసీపై కార్టూన్ తో మంట పుట్టించిన కాంగ్రెస్‌!
X
దేశ చ‌రిత్ర‌లో తొలిసారి ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరును త‌ప్పుప‌డుతూ రాజ‌కీయ పార్టీలు నిర్వ‌హించిన ధ‌ర్నాకు హైద‌రాబాద్ వేదికైంది. తెలంగాణ‌రాష్ట్రంలో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈవీఎంలో లోపాలు చోటు చేసుకున్న‌ట్లుగా కాంగ్రెస్ తో స‌హా ప‌లు విపక్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌టం తెలిసిందే. పోలైన ఓట్ల‌కు.. వీవీప్యాట్ల స్లిప్పుల‌కు లెక్క కుద‌ర‌టం లేద‌ని.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌ని చేస్తే అస‌లు విష‌యం తెలుస్తుందంటూ కాంగ్రెస్‌నేత‌లు వాదిస్తున్నారు.

ఓట‌రు జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు.. మ‌ద్యం..ధ‌న ప్ర‌భావంతో పాటు ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల్ని పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌లేద‌న్న ఆరోప‌ణ‌ల్ని చేశారు. రాజ‌స్థాన్.. బిహార్.. రాష్ట్రాల్లో వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్క వేసిన‌ప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లెక్కించ‌రంటూ కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు.

అవ‌క‌త‌వ‌క‌ల‌పై కోర్టుల‌కు వెళ్లినా నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రించాయ‌ని.. సుప్రీంకోర్టుకు వెళితే హైకోర్టుకు వెళ్ల‌మ‌న్నార‌ని.. హైకోర్టేమో ఈసీని న‌మ్మింద‌ని మ‌ర్రి వాపోయారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక కీల‌క వ్యాఖ్య చేశారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌ను గ‌త ఏడాది సెప్టెంబ‌రు ఒక‌టిన ప్ర‌క‌టించిన ఈసీ.. జ‌న‌వ‌రి 8 వ‌ర‌కు గ‌డువు విధించార‌ని.. ఏమైందో ఏమో కానీ సీఎం కేసీఆర్ సెప్టెంబ‌రు 6న అసెంబ్లీని ర‌ద్దు చేయ‌గానే గ‌డువును కుదించార‌న్నారు. ఆగ‌మేఘాల మీద ఎన్నిక‌ల్ని నిర్వ‌హించార‌ని.. పోలింగ్ అయ్యాక 22 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంతు అయ్యాయ‌ని... క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

ధ‌ర్నా సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ద‌ర్శించిన కార్టూన్ చిత్రం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మ‌హాభార‌తంలో ద్రౌప‌తి వ‌స్త్రాప‌హ‌ర‌ణం మాదిరే.. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం కూడా అదే రీతిలో జ‌రిగిందంటూ వ్యంగ్య చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఓట్ల‌ను ద్రౌప‌తిగా చిత్రీక‌రించిన ఈ కార్టూన్లో వ‌స్త్రాప‌హ‌ర‌ణం చేస్తున్న వారిగా ఈఆర్వోలు.. డీఈవోలు.. సీఈవోల‌ను పేర్ల‌ను ముద్రించారు. ఈసీఐ చూస్తున్న‌ట్లుగా చిత్రంలో ఉంది. అదే చిత్రంలో కేసీఆర్‌.. అస‌ద్‌కార్టూన్లు ఉన్నాయి. ఈ కార్టూన్ పై దుమ్ము దుమారం రేగుతోంది.

విచిత్ర‌మైన విష‌యం ఏమంటే.. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌ద‌ర్శిస్తున్న కార్టూన్ పై టీఆర్ ఎస్ నేత‌లు ఒక్క‌రు పెద‌వి విప్ప‌లేదు కానీ.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ మాత్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని ఫైర్ అయ్యారు. ఒక జాతీయ ఛాన‌ల్ తో మాట్లాడే సంద‌ర్భంలో అస‌ద్ ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగ‌ట‌మే కాదు.. అనుచిత వ్యాఖ్య చేయ‌టం ఇప్పుడు మ‌రో వివాదంగా మారింది. రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీల‌తో ఇలాగే కార్టూన్ వేస్తే కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంద‌ని ప్ర‌శ్నించ‌టంపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు.మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ ప్ర‌ద‌ర్శించిన కార్టూన్ ఇప్పుడు కొత్త సెగ‌లు రేగేలా చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు.