Begin typing your search above and press return to search.

ఓవైసీలు ల‌క్ష్యంగా బీజేపీ-టీఆర్ ఎస్‌ కు చెడుతోందా?

By:  Tupaki Desk   |   6 Sep 2017 5:00 PM GMT
ఓవైసీలు ల‌క్ష్యంగా బీజేపీ-టీఆర్ ఎస్‌ కు చెడుతోందా?
X
తెలంగాణ‌లో చిత్ర‌మైన రాజ‌కీయ దోర‌ణి కనిపిస్తోంద‌ని రాజకీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఒకే పార్టీ కేంద్రంగా రెండు అధికార ప‌క్షాలు టార్గెట్ చేసుకుంటున్నాయ‌ని చెప్తున్నారు. ఆ రెండు పార్టీలే తెలంగాణ‌లో అధికార పార్టీ అయిన టీఆర్‌ ఎస్ - కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న బీజేపీ. ఇంత‌కీ ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కార‌ణంగా మారిన పార్టీ ఏఐఎంఐఎం. ఓవైసీ సోద‌రుల సార‌థ్యంలోని ఈ పార్టీ కార‌ణంగా ఇరు పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.

వివిధ రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీఆర్‌ ఎస్ - బీజేపీ అగ్ర నాయకత్వాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇందుకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ రాష్ట్ర విష‌యాల్లో స్పందిస్తున్న తీరు - ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రానికి అందిస్తున్న స‌హాయ‌స‌హ‌కారాలు నిద‌ర్శ‌నం. అయితే రాష్ట్రంలో మాత్రం రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ చిత్ర‌మైన పోరాటంలో భాగంగా ఇరు పార్టీలు ఎంఐఎం కేంద్రంగా విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ఎంఐఎం చెప్పు చేతుల్లో టీఆర్‌ ఎస్ పార్టీ ఉందని బీజేపీ నాయకులు విమర్శిస్తుండగా - ఎంఐఎం పేరుతో రాష్ట్రంలో మత కలహాలు రేపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్‌ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని టీఆర్‌ ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకునేందుకు కార‌ణ‌మైన అంశం హైద‌రాబాద్ విలీనం జ‌రిపే అంశం.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ తో గత మూడేళ్ల నుంచి బీజేపీ సెప్టెంబర్‌ లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఈ కార్యక్రమాల ద్వారా బీజేపీకి పెద్దగా మైలేజీ ఏమీ లభించలేదు. అయితే ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ యాత్రలో ఎంఐఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని విమర్శలు చేస్తున్నారు. విమోచన యాత్ర ద్వారా ఈసారి ఎలాగైనా మైలేజీ లభించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన బీజేపీకి కేంద్ర మంత్రివర్గ విస్తరణ అశనిపాతంలా తగిలింది. ఉన్న ఒక్క మంత్రిని మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించ‌డం బీజేపీ నేత‌ల‌కు షాకిచ్చింది.

మ‌రోవైపు బీజేపీ పోరాటాన్ని టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో తిప్పికొడుతోంది. మతం పేరుతో చిచ్చు పెట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణలో ఫలించవని ధీమాగా ఉన్నారు. ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 గురించి ఎప్పుడూ మాట్లాడని బీజేపీ నాయకులకు తెలంగాణ ఏర్పడిన తరువాత సెప్టెంబర్ 17 గుర్తుకు వచ్చిందని విశ్లేషిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించింది ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మూడేళ్లలో తెలంగాణకు ఇక్కడి బీజేపీ నేతలు తెచ్చింది ఏమీ లేదంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా లకు తెలంగాణ బీజేపీ నాయకులపై ఏ మాత్రం నమ్మకం లేదని అందుకే దత్తన్నను మంత్రివర్గం నుంచి తొలగించార‌ని కానీ ఓట్ల కోసం మాత్రం రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఎంఐఎం కేంద్రంగా త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేయాల‌నే ఎత్తుగ‌డ‌లు ఫ‌లించ‌బోవ‌ని అంటున్నారు. బీజేపీ తెలంగాణ నాయకులను కేంద్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని - సెప్టెంబర్ 17పేరుతో ఉద్రిక్తతలు కలిగేట్టు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారని, వీరిని తెలంగాణలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 17గడిస్తే వీళ్లకు మరో అంశం కూడా లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.