Begin typing your search above and press return to search.

ట్రాక్టర్​ ర్యాలీ ముసుగులో అలజడికి పాక్​ కుట్ర.. ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 4:30 AM GMT
ట్రాక్టర్​ ర్యాలీ ముసుగులో అలజడికి పాక్​ కుట్ర..  ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​..!
X
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం పలుమార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. అయితే మొదటి నుంచి రైతుల ఆందోళనపై బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు దూరాయని.. పాకిస్థాన్​ జిందాబాద్​ నినాదాలు వినిపిస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే రైతు సంఘాలు మాత్రం బీజేపీ నేతల ఆరోపణలు తోసిపుచ్చాయి. పెట్టుబడిదారుల కోసం కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని.. వీటిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా పోరాడుతున్న రైతులపై దేశద్రోహులంటూ ముద్ర వేస్తున్నారని ఇది సరికాదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జనవరి 26న రైతు సంఘాలు ఢిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. మొదట్లో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత కట్టుదిట్టమైన భద్రతతో అనుమతి వచ్చింది. అయితే ఇప్పడు ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్(ఇంటెలీజెన్స్) దీపేంద్ర పాఠక్ సంచలన విషయాలు బయటపెట్టారు. రైతు సంఘాల మాటున దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్​లో కుట్రలు జరిగాయిన ఆయన ఆరోపించారు.

ఇందుకోసం పాకిస్థాన్​లో సుమారు 300 ట్విట్టర్​ ఖాతాలు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ‘కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్ ర్యాలీ జరుగునున్నది. అయితే ఈ ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌లో కుట్రలు జరిగాయి’ అని ఆయన చెప్పారు. అయితే మరోవైపు రైతు సంఘాల ట్రాక్టర్​ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ వీధుల్లో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.