Begin typing your search above and press return to search.

ఏలూరు వింత వ్యాధి ... అనారోగ్యానికి కారణమిదే !

By:  Tupaki Desk   |   8 Dec 2020 1:11 PM IST
ఏలూరు వింత వ్యాధి ... అనారోగ్యానికి కారణమిదే !
X
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వ్యాపిస్తున్న వింత వ్యాధితో స్థానికుల్లో ఆందోళన పెరిగిపోతుంది. అయితే, ఈ వ్యాధికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాడీ వ్యవస్థ పై విషపదార్థాల ప్రభావం తీవ్రంగా పడటం వల్లనే కుప్పలు తెప్పలుగా ఫిట్స్‌ కేసులు నమోదు అవుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఒకే ప్రాంతం నుండి ఎక్కువమంది ఈ సమస్యతో ఆస్పత్రిలో చేరుతుండటంతో, వారు తినే ఆహారంలో ఆర్గానో పాస్ఫేట్‌, లేక ఫైలేత్రిం విష పదార్థం కలిసి ఉంటుందని వైద్యులు ఓ అంచనాకి వస్తున్నారు.

ఈ విష పదార్థం శరీరంలోకి వెళ్లడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. తొలుత మెదడు, వెన్నెముకతో పాటు శరీరంలోని నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సమయంలో నెమ్మదిగా ఒళ్లు నొప్పులు ప్రారంభమై, అకస్మాత్తుగా మూర్ఛ వస్తుంది. ప్రస్తుతం ఏలూరులో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం మందిలో ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో మరొక లక్షణాన్ని సోమవారం వైద్యులు గుర్తించారు. బాధితుల కళ్లను పరిశీలించగా, ప్యూపిల్‌ డైలటేషన్‌ అనే సమస్య బయటపడింది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పరిశీలించిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఉందని గుర్తించారు.

ఆరోగ్యశాఖ ఇప్పటివరకూ చేసిన పరీక్షల వల్ల ఎలాంటి సమస్య బయటపడలేదు. అందరి రిపోర్టులు నార్మల్‌గానే ఉన్నాయి. 45 మందికి బ్రెయిన్‌ సీటీ స్కాన్‌ చేశారు. ఇందులోనూ ఏమీ తేలలేదు. తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు తీసుకున్నారు. ఈ రిపోర్టులు రావాల్సి ఉంది. కల్చర్‌ రిపోర్టు, ఈ-కోలీ పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ అనాలసిస్‌ కోసం 10 మంది దగ్గర నుంచి శాంపిల్స్‌ తీసుకుని హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపించారు. తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అందుకే అక్కడి తాగునీరు, పాల నమూనాలను ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణులు పరీక్షించనున్నారు. కలుషిత నీటితో పాటు పాల్లోనూ తేడాలున్నట్లు డాక్టర్లు, నిపుణులు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ పాల విక్రయం అనధికారికంగా సాగుతోంది. ఇంటిటికీ ఈ పాలు విక్రయించకపోయినా స్వీట్ షాపులు, హోటళ్లు, స్థానిక డెయిరీల్లో కల్తీపాల వినియోగం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పాలపొడితో తయారు చేసిన పాలను వాడడకం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.