Begin typing your search above and press return to search.

అస్సాం అతలాకుతలం: బ్రహ్మపుత్ర నది ఉధృతి తో అల్లకల్లోలం

By:  Tupaki Desk   |   1 July 2020 12:45 PM IST
అస్సాం అతలాకుతలం: బ్రహ్మపుత్ర నది ఉధృతి తో అల్లకల్లోలం
X
బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాలుస్తోంది. భారీ వర్షాలతో అస్సాం రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఆ రాష్ట్రంలో వరదలు వచ్చేలా పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ రాష్ట్రంలో పరిస్థితిపై ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. రాష్ర్టంలోని ఉడల్‌గురి, కమ్రప్ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా థెమాజీ, దక్షిణ సల్మారా, లఖంపూర్‌, నల్బరి, బార్పేట, కోక్రాజార్‌, గోల్‌పారా, కమ్రప్‌, మోరిగావ్‌, గోలఘాట్‌, జోర్హాట్‌, దిర్హాట్‌ తదితర జిల్లాలో వరద ఉధృతంగా ఉందని తెలిపింది. గౌహతి, జోర్హాట్‌లోని నీమాటిఘాట్‌, సోనిత్‌పూర్‌లోని తేజ్‌పూర్‌, గోల్‌పారా పట్టణం, దుబ్రీ పట్టణాల వద్ద బ్రహ్మపుత్ర నదీ ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తోంది.

పరిస్థితి ఇలా ఉండగా భారీ వర్షాలతో వరదలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అస్సాంలో దుర్భర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు ఉండగా 25 జిల్లాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. దీని ప్రభావంతో 13.2 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. ఈ వరదలకు ప్రాణనష్టం భారీగా ఉంటోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 25కు చేరుకుంది. బార్పేట జిల్లా వరదలకు తీవ్ర ప్రభావానికి గురైంది. ఈ ఒక్క జిల్లాలో 75,700 హెక్టార్ల వ్యవసాయ భూమి కోతకు గురైంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై గడిచిన 24 గంటల్లో 3,245 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఇక ఈ వర్షాలు.. వరదలతో మొరిగావ్‌లోని పోబిటోరా వన్యప్రాణాల అభయారణ్యం, మంగల్‌డోయిలోని ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్, గోలాఘాట్‌లోని కజిరంగ నేషనల్‌ పార్కు లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టడంతో 21 జిల్లాల్లో అధికారులు 265 సహాయక శిబిరాలను ఏర్పాటుచేశారు. 25,461 మందికి ఆశ్రయం కల్పించారు.