Begin typing your search above and press return to search.

ఫుట్ బాల్ స్టేడియంలో హింసాకాండ.. 127 మంది మృతి

By:  Tupaki Desk   |   2 Oct 2022 3:47 AM GMT
ఫుట్ బాల్ స్టేడియంలో హింసాకాండ.. 127 మంది మృతి
X
'ఆట'ను ఆటగా మాత్రమే చూడాలి. ఆట అన్న తర్వాత గెలుపు.. ఓటమి ఖాయం. తల పడిన రెండు జట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే వీలు ఉండదు. ఆ విషయాన్ని వదిలేసి.. ఘర్షణకు దిగటమే కాదు.. యుద్ధాన్ని తలపించేలా జరిగిన ఘర్షణల్లో ఏకంగా 127 మంది మరణించిన షాకింగ్ ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా ఉండే దేశంగా పేరున్న బీద దేశం ఇండోనేషియా.

మిగిలిన దేశాలతో పోలిస్తే.. ఆ దేశంలో హింసా కాండ తక్కువనే చెబుతారు. అక్కడి ప్రజలు ఫుట్ బాల్ ను విపరీతంగా ఆరాధిస్తారు. మనకు క్రికెట్ ఎలానో.. అక్కడి వారికి ఫుట్ బాల్ అలా. అలాంటి క్రీడకు సంబంధించిన ఒక మ్యాచ్ తీవ్ర విషాదానికి కారణమైంది. మ్యాచ్ లో ఓటమి స్టేడియంలో బీభత్సమైన హింసకు కారణమైంది. దీంతో 127 మంది ప్రాణాల్ని కోల్పోవాల్సిన దారుణం చోటు చేసుకుంది.

తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ బీఆర్ఐ లిగా1 ఫుట్ మ్యాచ్ జరిగింది. ఇందులో అరేమా ఎఫ్ సి వర్సెస్ పెర్సాబయా సురబయా మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఓడిన జట్టు అభిమానులు ఒక్కసారిగా.. గెలిచిన జట్టు అభిమానులపై దాడికి దిగారు. దీంతో.. అల్లరి మూకను అదుపు చేయటానికి పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో టియర్ గ్యాస్ ను ప్రయోగించారు.

ఈ సందర్భంగా చోటు చేసుకున్న గందరగోళం.. హింసాకాండలో 127 మంది మరణించారు. ఇంత భారీగా మరణాలు చోటు చేసుకోవటానికి కారణం.. హింసాకాండలో జరిగిన తొక్కిసలాట.. పోలీసులు విడుదల చేసిన టియర్ గ్యాస్ తో ఊపిరి ఆడక మరణించినట్లుగా చెబుతున్నారు. మరణించిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉండటం గమనార్హం. స్టేడియంలోపల 34 మంది మరణిస్తే.. మిగిలిన వారు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. జరిగిన ఈ హింసా కాండపై ఇండోనేషియా ఫుట్ బాల్ అసోసియేషన్ తీవ్ర దిగ్భాంత్రిని.. విచారాన్ని వ్యక్తం చేసింది. మ్యాచ్ తర్వాత ఏం జరిగిందన్న అంశంపై దర్యాప్తు చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేశారు.

ఈ మొత్తం హింసకు ఓడిన అరెమా ఎఫ్ సీ జట్టు అభిమానులే అని చెబుతున్నారు. తాజా అల్లర్ల నేపథ్యంలో అరేమా ఎఫ్ సీ లీగ్ ను వారం పాటు ఆపేయటమేకాదు.. ఈ పోటీలో సదరు జట్టుపై బ్యాన్ కూడా విధించినట్లుగా చెబుతున్నారు. స్టేడియంలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితులు అర్థమయ్యేలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.