Begin typing your search above and press return to search.

పండుగ రోజున ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌

By:  Tupaki Desk   |   2 Jun 2015 9:22 AM GMT
పండుగ రోజున ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌
X
ఆర‌వైఏళ్ల క‌ల సాకార‌మై ఏడాదైన వేళ‌.. వంద‌లాది మంది విద్యార్థులు.. యువ‌కులు త‌మ ప్రాణాల్ని తృణ‌ప్రాయంగా భావించి త‌మ‌ను తాము జ్వ‌లింప‌చేసుకొని.. సాధించుకున్న తెలంగాణ వ‌చ్చి ఏడాది అయ్యింది. కోటి క‌ల‌ల‌తో.. భ‌విష్య‌త్తు తెలంగాణ ద‌ర్శ‌నంతో ఉత్సాహంతో ఉర‌క‌లెత్తాల్సిన ఉస్మానియ వ‌ర్సిటీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం రోజున తీవ్ర ఉద్రిక‌త్త‌తో ఊగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చి ఏడాదైన రోజున‌.. పండుగ వాతావ‌ర‌ణంతో శోభిల్లాల్సిన ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం అందుకు భిన్నంగా ఉంది.

తెలంగాణ ఉద్య‌మానికి పురిటిగ‌డ్డ అయిన ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఇంత ఉద్రిక‌త్త‌ల‌కు కార‌ణం తెలంగాణ స‌ర్కారేన‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి ఏడాది అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికే విద్యార్థుల‌కు ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌లేదని.. దీనికి తోడు ఓయూ భూముల్ని సేక‌రించి పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై వారు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న విద్యార్థులు.. ఆవిర్భావ వేడుక‌ల్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌కు నిర‌స‌న‌గా ర్యాలీ నిర్వ‌హించ‌టంతో దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇరువ‌ర్గాల వారి మ‌ధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆవిర్భావ వేడుక‌ల‌కు నిర‌స‌న ర్యాలీ నిర్వ‌హించ‌టంపై మండిప‌డుతున్న పోలీసులు.. విద్యార్థులను ఆరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించ‌టంతో ఓయూలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. పండుగ వాతావ‌ర‌ణం వెల్లివిరియాల్సిన ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఉద్రిక్త‌త‌ల‌తో ఊగిపోవ‌టానికి కార‌ణం ఎవ‌రు? దీనికి బాధ్య‌త ఎవ‌రు వ‌హిస్తారు..?