Begin typing your search above and press return to search.

ఉద్య‌మ‌వేళ ఆత్మ‌హ‌త్య‌లు ఇప్పుడు మ‌ళ్లీనా?

By:  Tupaki Desk   |   4 Dec 2017 5:45 AM GMT
ఉద్య‌మ‌వేళ ఆత్మ‌హ‌త్య‌లు ఇప్పుడు మ‌ళ్లీనా?
X
క‌ల‌ల తెలంగాణ ఏర్ప‌డితే చాలు.. మొత్తం బంగార‌మైపోతుంది. ప‌రిస్థితుల‌న్నీ మారిపోతాయ్‌. బ‌తుకులు మొత్తంగా మార‌కున్నా.. అర్థాంత‌రపు చావులు మాత్రం ఉండ‌నే ఉండ‌వ‌న్నారు. ఆంధ్రోళ్ల పాల‌న‌లో ఆత్మాభిమానాన్ని దెబ్బేస్తూ.. మోస‌పూరిత పాల‌న‌తో తెలంగాణ బిడ్డ‌ల‌కు చేస్తున్న అన్యాయాల‌పై క‌డుపు మండి.. నిర‌స‌న అగ్గిలో ఆత్మ‌బ‌లిదానం చేసుకోవ‌టం ఉండేది.

ఇలాంటి మ‌ర‌ణాలు లేకుండా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిందేన‌న్న డిమాండ్ బ‌లంగా వినిపించేది. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ‌బ‌లిదానాల వేళ‌.. తెలంగాణ స‌మాజం భావోద్వేగంతో ఊగిపోయేది. త‌మ పిల్ల‌ల ఉసురు తీస్తున్న సీమాంధ్ర‌పాల‌కుల పాల‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌య్యేది.

బ‌లిదానాలు.. త్యాగాల ఫ‌లితంగా తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించింది. అక్క‌డితో ఆత్మ‌హ‌త్య‌ల ప‌రంప‌ర ఆగిపోవాలి. కానీ.. అలా జ‌ర‌గ‌ట్లేదు. ఉద్య‌మ వేళ‌లో ఎవ‌రైనా ఆత్మ‌హ‌త్య చేసుకున్నంత‌నే స్పందించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. ఆ పార్టీకి కీల‌క‌మైన హ‌రీశ్‌.. కేటీఆర్‌.. క‌విత‌.. ఈటెల లాంటి వారిప్పుడు మాట్లాడ‌టం లేదు.

ఎవ‌రైనా ఆత్మ‌హ‌త్య చేసుకున్నంత‌నే వారి వ‌ద్ద‌కు వెళ్ల‌టం.. వారి కుటుంబాల్ని ఓదార్చ‌టం చేసేవారు. ఇక‌.. ఓయూలో జ‌రిగిన బ‌లిదానాల విష‌యంలో అయితే.. ఏకంగా కేసీఆరే హాజ‌ర‌య్యేవారు. బంద్‌ల‌కు పిలుపునిచ్చేవారు. మ‌రి.. కోరి సాధించుకున్న తెలంగాణ‌లో ఆత్మ‌హ‌త్య‌లు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఏ ఆత్మ‌హ‌త్య‌లు సీమాంధ్ర దుర్మార్గాల‌కు బ‌లిదానంగా అభివ‌ర్ణించారో.. తెలంగాణ రాష్ట్రంలోనూ అవి ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణం ఎవ‌ర‌న్న నిల‌దీత ఉండేది. పోరాడి సాధించుకున్న తెలంగాణ‌లో అలాంటిది మ‌చ్చుకు కూడా క‌నిపించ‌దు.

ఉద్య‌మ రాజ‌కీయ పార్టీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చిన పార్టీ చేతుల్లోకి ప‌వ‌ర్ వ‌చ్చిన‌ప్పుడు.. ఆవేద‌న‌తో ఆత్మ‌హ‌త్య చేసుకునే ప‌రిస్థితులు చోటు చేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అందుకు భిన్నంగా జ‌రిగితేనే ఇబ్బంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డినంత‌నే ఏదో జ‌రుగుతుంద‌న్న భావ‌న తెలంగాణ ప్ర‌జ‌ల్లోనూ.. యువ‌తలోనూ ఉంది. నాలుగేళ్ల సొంతోళ్ల పాల‌న‌లోనూ ప‌రిస్థితుల్లో మార్పు లేద‌న్న అసంతృప్తి ఇప్పుడు ఆత్మ‌హ‌త్య‌ల వ‌ర‌కూ వెళుతోంది.

ఇందుకు నిద‌ర్శ‌నంగా నిన్న‌టి ఓయూ క్యాంప‌స్ లో పీజీ విద్యార్థి ముర‌ళీ ఆత్మ‌హ‌త్య‌గా చెప్పాలి. ఉద్యోగం రాక‌పోవ‌టం.. వ‌స్తుంద‌న్న ఆశ లేక‌పోవ‌టంతో తీవ్ర ఒత్తిడికి గురైన అత‌గాడు.. తాను ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని.. ఆలోచించిన కొద్దీ పిచ్చి లేస్తుందంటూ త‌న సూసైడ్ లెట‌ర్ లో రాసుకొచ్చారు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం విచారం వ్య‌క్తం చేసిన పాపాన పోలేదు. విచారం సంగ‌తిని వ‌దిలేసినా.. ఉద్యోగాల కోసం యువ‌త ఆత్మ‌బ‌లిదానాలు స‌రికావ‌ని.. స్ప‌ష్ట‌మైన కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించినా బాగుండేది కానీ.. అది జ‌ర‌గ‌లేదు. ఉద్య‌మ నేత‌లుగా భావోద్వేగంతో మాట్లాడే ఈటెల.. హ‌రీశ్ లాంటోళ్లు ఒక్క‌రంటే ఒక్క‌రు స్పందించింది లేదు.

కొలువుల కోట్లాట‌కు ఒక రోజు ముందుగా చోటు చేసుకున్న ఈ ఆత్మ‌హ‌త్య దేనికి సంకేతం? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్య‌మానికి వెన్నుముక‌గా నిలిచిన యువ‌త‌లో గూడుక‌ట్టుకున్న అసంతృప్తి ఆత్మ‌హ‌త్య‌ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చిందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. అదే నిజ‌మైతే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న తెలంగాణ స‌ర్కారు స్పందించాల్సిన అవ‌స‌రం ఉంది. యువ‌త ఆకాంక్షాల్ని నెర‌వేర్చేందుకు ప్ర‌భుత్వం ఎంత క‌మిట్ మెంట్ తో ఉంద‌న్న విష‌యాన్ని మాట‌ల్లో చెప్ప‌ట‌మే కాదు.. చేత‌ల్లో చేసి చూపించాల్సిన అవ‌స‌రం ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణ బిడ్డ‌ల ఆత్మ‌బ‌లిదానాల‌కు పుల్ స్టాప్ ప‌డాలి. అవి కొన‌సాగితే.. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ‌కు అర్థం ఉండ‌దు. సొంత సర్కారును నిల‌దీసి.. కోట్లాడి మ‌రి డిమాండ్లు సాధించుకోవాలే కానీ.. అర్థాంత‌రంగా ప్రాణాలు తీసుకోవ‌టం ఏ మాత్రం మంచిది కాదు.