Begin typing your search above and press return to search.

అజాత‌శ‌త్రువుపై ఇరుగుపొరుగు దేశాల అభిమానం

By:  Tupaki Desk   |   17 Aug 2018 6:30 AM GMT
అజాత‌శ‌త్రువుపై ఇరుగుపొరుగు దేశాల అభిమానం
X
రంగం ఏదైనా కానీ శ‌త్రువులే కానీ.. అజాత శ‌త్రువుగా ఉండ‌టం సాధ్యం కాని ప‌ని. ఒక దేశం మీద యుద్ధానికి సై అనట‌మే కాదు.. యుద్ధం చేసి ఓడిస్తే.. ఆ నిర్ణ‌యం తీసుకున్న అధినేత మీద ఎలాంటి తీరును ప్ర‌ద‌ర్శిస్తుంది? క‌చ్ఛితంగా అత‌న్ని త‌మ ప్ర‌ధ‌మ శ‌త్రువుగా భావిస్తుంది.కానీ.. వాజ్ పేయ్ ఇలాంటి వాటికి పూర్తి భిన్నం.

పాక్ దురాక్ర‌మ‌ణ‌ను బ‌లంగా దెబ్బ తీయ‌టానికి కార్గిల్ వార్ ను చేప‌ట్టి పాక్ తోక ముడిచేలా చేసిన ధీర‌త్వం వాజ్ పేయ్ సొంతం. మ‌రి.. అలాంటి వాజ్ పేయ్ ఆస్త‌మ‌యం వేళ‌.. పాక్ ఎలా స్పందించిందంటే.. మ‌రే నేత‌కు ద‌క్క‌ని గౌర‌వం ఆయ‌న‌కు ద‌క్కేలా చేసింది. వాజ్ పేయ్ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఇరుగుపొరుగు దేశాలు.. ఆయ‌నంటే త‌మ‌కున్న గౌర‌వాన్ని చాటాయి.

ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు త‌మ త‌ర‌ఫున ప్ర‌త్యేక ప్ర‌తినిధుల‌ను భార‌త్‌కు పంపాల‌ని నిర్ణ‌యించారు. వాజ్ పేయ్ నిర్ణ‌యం కార‌ణంగా యుద్ధంలో ఓట‌మి చెంద‌ట‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదిక మీద పాక్ కు దిమ్మ తిరిగేలాచేసిన అజాత‌శ‌త్రువుకు ఆఖ‌రి నివాళి అర్పించేందుకు త‌మ దేశం త‌ర‌ఫున ప్ర‌త్యేక ప్ర‌తినిధిని పంపాల‌ని దాయాది పాకిస్థాన్ నిర్ణ‌యం తీసుకుంది. ఇలాంటి అరుదైన ఘ‌న‌త వాజ్ పేయ్ సొంతంగా చెప్పాలి. తీవ్ర‌మైన అనారోగ్యంతో దాదాపు 9 ఏళ్లకు పైనే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న వాజ్ పేయ్ కు అంతిమ నివాళులు అర్పించేందుకు విదేశీ ప్ర‌తినిధులు వ‌స్తున్నారు.

వాజ్ పేయ్ కు నివాళులు అర్పించేందుకు భార‌త్ చుట్టున్న దేశాల ప్ర‌తినిధులు దేశానికి వ‌స్తున్నారు. పాకిస్థాన్ నుంచి న్యాయ‌.. స‌మాచార మంత్రి అలీ జాఫ‌ర్ ను పంప‌నున్న‌ట్లుగా స్థానిక మీడియా సంస్థ పేర్కొంది.శ్రీ‌లంక ప్ర‌ధాని విక్ర‌మ‌సింగే త‌ర‌ఫు ప్ర‌త్యేక రాయ‌బారిగా విదేశాంగ‌మంత్రి ల‌క్ష్మ‌ణ్ కిరియోల్లా హాజ‌రు కానున్నారు. వీరిద్ద‌రే కాదు.. నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి మీడియా స‌ల‌హాదారు కుంద‌న్ ఆర్య‌ల్ ఢిల్లీకి వ‌స్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఏహెచ్ మ‌హ‌మూద్ అలీ కూడా రానున్నారు. గురువారం సాయంత్రం ఎయిమ్స్ లో క‌న్నుమూసిన వాజ్ పేయ్ కు ఈ రోజు (శుక్ర‌వారం) మ‌ధ్యాహ్నం ఢిల్లీలోని స్మృతి స్థ‌ల్ వ‌ద్ద అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. రాజ‌కీయాల‌కు దూరంగా ఏళ్ల‌కు ఏళ్లు ఉన్నా.. క‌డ‌సారి వీడ్కోలు ప‌లికేందుకు ఇరుగుపొరుగు దేశాల ప్ర‌తినిధులు ప్ర‌త్యేకంగా రావ‌టం చూస్తే.. వాజ్ పేయ్ ప్ర‌త్యేక‌త ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.