Begin typing your search above and press return to search.

వివాదంగా మారిన ఉస్మానియా నిర్ణయం

By:  Tupaki Desk   |   5 May 2022 4:28 AM GMT
వివాదంగా మారిన ఉస్మానియా నిర్ణయం
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమంపై స్పష్టత వచ్చేసింది. యూనివర్సిటీ యాజమాన్యం రాహుల్ కార్యక్రమానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టులో ఎన్ఎస్ యూఐ విద్యార్ధి నాయకులు చాలెంజ్ చేసినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఉస్మానియా కార్యక్రమం విషయంలో రాహుల్ లేదా కాంగ్రెస్ నేతలు ఏమి చేస్తారనే విషయం ఇపుడు ఉత్కంఠగా మారింది.

సరే కోర్టు చెప్పినట్లుగా యూనివర్సిటిలో రాహుల్ కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవాల్సింది యాజమాన్యమే అనటంలో సందేహంలేదు. కానీ ఇదే యాజమాన్యం ఒక్కోరి విషయం ఒక్కోలాగా వ్యవహరిస్తుండటమే వివాదాలకు కారణమవుతోంది.

యూనివర్సిటిల్లో రాజకీయ కార్యకలాపాలకు అనుమతించకూడదని యూనివర్సిటీ నియమావళిలో ఉందని ఇపుడు కొత్తగా చెబుతుండటమే విచిత్రంగా ఉంది. నియమావళి ఉన్నదే నిజమైతే ఈ మధ్యనే కేసీయార్ జన్మదినోత్సవాన్ని యూనివర్సిటిలో ఘనంగా ఎలా జరిపారు.

జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రులు, ఎంఎల్ఏలు ఎలా హాజరయ్యారో యాజమాన్యం చెప్పగలదా . కేసీఆర్ జన్మదిన వేడుకలు రాజకీయ కార్యక్రమంగా యాజమాన్యానికి అనిపించలేదా ? లేకపోతే కేసీయార్ జన్మదిన వేడుకలు యూనివర్సిటిలో జరపచ్చని కూడా నియమావళిలో ఉందా ? అలాగే బీజేపీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ కూడా యూనివర్సిటీలోని విద్యార్ధులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. యూనివర్సిటిలో బీజేపీ ఎంఎల్ఏ మాక్ అసెంబ్లీ నిర్వహించటం రాజకీయ కార్యక్రమంగా యాజమాన్యానికి అనిపించలేదా ?

టీఆర్ఎస్, బీజేపీ కార్యక్రమాలను అనుమితించిన యాజమాన్యమే రాహుల్ కార్యక్రమాన్ని మాత్రం రాజకీయ కార్యకలాపంగా గుర్తించటమే ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే నిబంధనలు పాటించాలని అనుకుంటే యాజమాన్యం అన్నీ పార్టీల విషయంలో ఒకేలాగ వ్యవహరించాలి.

అంతేకానీ తమకిష్టమైన పార్టీల విషయంలో ఒకలాగ ఇష్టంలేని పార్టీ విషయంలో మరోలాగ వ్యవహరిస్తేనే యాజమాన్య వైఖరి వివాదాస్పదమవుతుంది. ఇపుడు రాహుల్ పర్యటనలో జరిగిందే కాబట్టే అందరు యాజమాన్యం గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. యాజమాన్యం వైఖరి వల్ల కాంగ్రెస్ అంటేనే కేసీయార్ భయపడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.