Begin typing your search above and press return to search.

యూత్ కేసీఆర్ ను వద్దనుకుంటోందా?

By:  Tupaki Desk   |   2 Nov 2015 6:37 AM GMT
యూత్ కేసీఆర్ ను వద్దనుకుంటోందా?
X
ఇది పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితికి పిడుగుపాటు లాంటిది. ఒకటిన్నర సంవత్సరం పాలనలో టీఆరెస్ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన తెలంగాణ విద్యార్థులు అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. కీలకమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ రాజయ్యకు మద్దతు పలికిన ఓయూ జాక్ - టీఎస్ జాక్ సంఘాలు తెరాసకు బహిరంగ సవాలు విసిరాయి. ఉస్మానియా విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ, తెలంగాణ విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ రెండూ 2009-2013 కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పరాకాష్టకు తీసుకుపోయాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఈ రెండు సంస్థలూ తెలంగాణ రాష్ట్రంలో తెరాస తొలి ప్రభుత్వాన్ని ఏర్పర్చడంలో కీలక పాత్ర పోషించాయి.

అధికారంలోకి వచ్చాక విద్యార్థులను పురుగుల్లాగ చూస్తూ తృణీకార భావం ప్రదర్శిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థి జేఏసీలు తొలి షాక్‌ ను ఇచ్చాయి. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన విద్యార్థి జేఏసీ నేతలు వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ కు మద్దతిస్తామని తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంకోసం బలిదానాలు చేసిన విద్యార్థుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు ప్రభుత్వం తర్వాత విద్యార్థులను, నిరుద్యోగ యువతను లెక్కచేయడం లేదని విద్యార్థి నేతలు ఆరోపించారు.

వైస్ చాన్సలర్లను నియమించకుండా కేసీఆర్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారని, ఉన్నత విద్యను పేదవర్గాలకు అందకుండా చేయాలనే కుట్రలో భాగంగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలను పూర్తిగా నిలిపివేశారని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏ విశ్వవిద్యాలయానికి ప్రస్తుతం ఒక్క వీసీ కూడా లేకపోవడం సిగ్గుచేటని జేఏసీ నేతలు ఆక్షేపించారు. తమ కేరీర్‌ ను, జీవితాలను వదులుకుని తాము త్యాగం చేసింది ఇలాంటి తెలంగాణ కోసమేనా అని వారు ప్రశ్నించారు.

వరంగల్ లోక్ సభా నియోజకవర్గ పరిదిలోని మొత్తం ఏడు శాసనసభా నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తామని, కేసీఆర్ ప్రభుత్వ దుష్పరిపాలనను ఎండగడతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని, పేదలకు రెండుపడకల ఇళ్లను, దళిత కుటుంబాలకు మూడు పడకగదుల ఇళ్లను కట్టిస్తామని వాగ్దానాలు చేసిన కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను నిండా మోసగించాడని వారు ఆరోపించారు.