Begin typing your search above and press return to search.

ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎంత పని చేసింది

By:  Tupaki Desk   |   27 July 2016 10:31 AM IST
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎంత పని చేసింది
X
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న ఒక ప్రమాదం నుంచి 23 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఒకటి హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతోంది. ఈ స్లీపర్ బస్సు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండటం మోచెర్ల సమీపంలో ఒక లారీని ఢీ కొట్టింది. వేగంగా వెళుతున్న బస్సు లారీని ఢీ కొట్టటంతో బస్సు కాస్తా పల్టీ కొట్టింది.

బస్సు ఇంజిన్ కు బలమైన దెబ్బ తగలటంతోమంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా అప్రమత్తమైన డ్రైవర్ హెచ్చరికతో.. బస్సులోని 23 మంది ప్రయాణికులు క్షణాల్లో బస్సు నుంచి బయటకు వచ్చేశారు. అలా వచ్చేసిన క్షణాల్లో బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకొని పూర్తిగా దగ్థమైంది. బస్సు లోపల నుంచి బయటకు రావటంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా దారుణం జరిగి ఉండేది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్.. క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులు కొంతమందికి చిన్నపాటి దెబ్బలు తగిలాయి. ఇక.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల లగేజ్ పూర్తిగా దగ్థమైంది. హైవే మీద చోటు చేసుకున్న ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మృత్యువును క్లోజ్ అప్ లో చూశామంటూ ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు వాపోతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.