Begin typing your search above and press return to search.

పాపం.. కేసీఆర్..

By:  Tupaki Desk   |   4 Aug 2015 3:52 AM GMT
పాపం.. కేసీఆర్..
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దేనిని ముట్టుకుంటే అది వివాదంగా మారుతోంది. ఆయన దేనిని బాగు చేద్దామని భావిస్తే అది తిరుగుముఖం పడుతోంది. ఆయన ముందుకు ఒక అడుగు వేయగానే.. ఆ తర్వాత అదే అడుగు పది అడుగులు వెనక్కి వేయాల్సి వస్తోంది. తాజాగా, ఉస్మానియా ఆస్పత్రి విషయంలోనూ కేసీఆర్ కు ఎదురు దెబ్బలు తప్పడం లేదు.

సచివాలయానికి వాస్తు దోషం ఉందన్న కేసీఆర్.. దానిని తీసేసి చెస్ట్ ఆస్పత్రిలో సరికొత్తగా ఆధునిక హంగులతో సచివాలయం కడతానని చెప్పారు. అది కాస్తా వెనక్కి పోయింది. చెస్ట్ ఆస్పత్రిని మార్చాల్సిన అవసరం లేదంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పేదలకు ఇళ్లు నిర్మిస్తానని కేసీఆర్ చెప్పారు. అది కూడా వివాదాస్పదం అయిపోయింది. పరేడ్ గ్రౌండ్స్, బైసన్ గ్రౌండ్స్ తీసుకుంటానన్నారు. అది కూడా అంతే. ఇప్పుడు తాజాగా ఉస్మానియా ఆస్పత్రి వివాదం.

నిజానికి ఉస్మానియా ఆస్పత్రి శిథిలమైపోయింది. దానిని ఎగ్జిబిషన్ గా ఉంచినా అది కూలిపోవడం తప్ప మరొకటి జరగదు. దానిని చారిత్రక కట్టడంగా తీర్చిదిద్దాలనుకున్నా ఉపయోగం ఉండదు. దాని బదులు దాని స్థానంలో ఆస్పత్రి కడితే ఎంతో మంది పేదలకు ఉపయుక్తంగా ఉంటుంది. మరో వందేళ్లపాటు పేదలకు సేవ చేయడానికి ఉంటుంది. ఈ ఆలోచనతోనే కేసీఆర్ ఉస్మానియా స్థానంలో 20 అంతస్తుల భవనం నిర్మిస్తానని చెప్పారు. ఆ దిశగా పావులు కదిపారు. కానీ, ప్రతిపక్షాలు దానిని కూడా పడనివ్వడం లేదు. ఉస్మానియా ఆస్పత్రిని చారిత్రక కట్టడంగా ఉంచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రి చారిత్రక కట్టడం ఏమిటి? అది శిథిలమైతే కూల్చక ఏం చేస్తారని ప్రభుత్వం కూడా నేరుగా ప్రశ్నించలేకపోతోంది. మొత్తం మీద ఇది మరొక వివాదంగా మారింది.