Begin typing your search above and press return to search.

ఆత్మహత్యలకు ఈ సర్కారే కారణం

By:  Tupaki Desk   |   22 Sept 2015 11:00 PM IST
ఆత్మహత్యలకు ఈ సర్కారే కారణం
X
తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు జరిగే ఆత్మహత్యలన్నీ గత ప్రభుత్వ పాపాలని, నాలుగేళ్ల తర్వాత జరిగే హత్యలకు బాధ్యత తమది అంటూ ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న ప్రకటనలను కొట్టిపారేస్తున్నారు. అవి బాధ్యతారాహిత్యంతో కూడిన ప్రకటనలని స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు రైతుల ఆత్మహత్యలకు విద్యుత్తు కోతలే ప్రధాన కారణమని వివరిస్తున్నారు. నడి వేసవిలోనూ విద్యుత్తును సరఫరా చేశామని చెప్పుకొనేందుకు.. హైదరాబాద్ లో ఎటువంటి కోత లేకుండా చూశామని చెప్పుకొనేందుకు గ్రామాల్లో వ్యవసాయానికి దారుణంగా కోతలు కోశారని, కనీసం ఒక్కటంటే ఒక్క గంట కూడా వ్యవసాయానికి కరెంటు ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటు వర్షాలు లేక.. అటు కరెంటు కూడా లేకపోవడంతో పంటలు ఎండిపోయాయని వివరిస్తున్నారు. బోర్లు లేని రైతులకు కరెంటు ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉందని, కానీ, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో అత్యధికులు బోర్లు పని చేస్తున్నా పంట పండని వాళ్లు అత్యధికంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చి ఉంటే వారి పంటలన్నీ బతికి ఉండేవని, కనీసం కొంతమంది అయినా ప్రాణాలు తీసుకోకుండా ఉండి ఉండేవారేని, ఈసారి పెట్టుబడి పెట్టిన తర్వాత.. ఆ పంట చేతికి రాకపోవడంతోనే అత్యధికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరిస్తున్నారు.

ఈ నెల రోజుల్లో ఇప్పటి వరకూ చేసుకున్న ఆత్మహత్యలన్నీ ఇటువంటివేనని, పంట పండక ఆత్మహత్యలు చేసుకున్నవేనని, ఇందుకు ప్రధాన కారణం విద్యుత్తు లేకపోవడమేనని, అందువల్ల ఈ ఆత్మహత్యల పాపం కేసీఆర్ ప్రభుత్వానిదేనని వివరిస్తున్నారు.