Begin typing your search above and press return to search.

మాయ చేయాలని నానా పాట్లు!

By:  Tupaki Desk   |   11 Sep 2015 4:18 AM GMT
మాయ చేయాలని నానా పాట్లు!
X
రాజధాని నగరంలో నిజామాబాద్‌ జిల్లా రాంరెడ్డి పల్లె కు చెందిన రైతు లింబయ్య ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మరింత ఎక్కువ సంచలనాంశంగా తయారవుతోంది. ఈఆత్మహత్యను వాడుకుని.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు మితిమీరిపోతున్నాయంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు సహజంగానే అవకాశాన్ని వాడుకుంటున్నాయి. అదే సమయంలో.. అసలు లింబయ్య చావుకు రైతు ఆత్మహత్యగా ముద్ర వేయడానికి వీలే లేదని.. ప్రభుత్వం, తెరాసకు అనుకూలంగా ఉండే మీడియా... రకరకాల కథనాలను వండి వారుస్తున్నది. మొత్తానికి లింబయ్య చావు అనేది.. ఇరు పక్షాల్లోనూ బాగా వేడిని రగిలించింది. ఎవరి వాదనను వారు బలపరచుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.

ప్రధానంగా ఇప్పుడు లింబయ్యది 'రైతు ఆత్మహత్య' కాదని నిరూపించడానికి గులాబీ కోటరీ ప్రయత్నిస్తున్నది. దీనికి సంబంధించి.. ముఖ్యమంత్రి కార్యాలయం ఒక వివరణకూడా ఇచ్చింది. లింబయ్యకు ఆరెకరాల భూమి ఉన్నదని, అందులో మూడెకరాల్లో వేసిన పంటలు కూడా బాగున్నాయని వివరించింది. ఆయనకు రుణమాఫీ కూడా చేసినట్లు తెలిపింది. ఆయన పెద్దకొడుకు మూడునెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆయనకు కూడా అనారోగ్యం ఉందని.. ఇలా రకరకాలకారణాలను జాబితా కట్టింది. దురదృష్టవశాత్తూ లింబయ్య ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప.. అందుకు వ్యవసాయ రుణాలు కారణం కాదని వారు పేర్కొన్నారు. ఆత్మహత్య జరిగిన వెంటనే.. త్రిసభ్య కమిటీ వెళ్లి.. ఆయన చావు గురించి విచారించి ఇచ్చిన నివేదిక ప్రకారం సీఎంఓ చెప్పిన కథనం ఇది. దారుణం ఏంటంటే.. లింబయ్య గ్రామంలో పలువురికి అప్పులు ఇస్తుండే వాడు.. అంటూ సర్కారు వారి నివేదిక పేర్కొనడం. అదే కుటుంబంలో ముగ్గురు సర్కారు పెన్షన్లు పొందుతుండగా, వారు ఇతరులకు అప్పులిచ్చే స్థాయిలో ఉన్నారని చెప్పడం అతిశయోక్తి గా కనిపిస్తోంది.

అయితే తెరాస అనుకూల పత్రికల్లో ఇంకా కఠోర వాదనలు ఉన్నాయి. అసలు లింబయ్యకు బ్యాంకు ఖాతాలో 1.10 లక్షలు ఉన్నాయని... ఆయనకు అసలు అప్పులే లేవని.. వీరు పరిశోధనచేసి తేల్చారు. సహజంగానే ఇలాంటి ఆత్మహత్యలు జరిగినప్పుడు.. ప్రెవేటు అప్పులు ఇచ్చిన వాళ్లు.. వేధింపులంటూ తమకు అంటగడతారేమోననే భయంతో.. అప్పులేమీ లేవని చెప్పేస్తుంటారు. అలా వీరు కథలు అల్లినట్లుంది. కేవలం కొడుకు అనారోగ్యం గురించిన వేదనతోనే లింబయ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా వీరు వండి వార్చేశారు.

మొత్తానికి కేసీఆర్‌ విదేశీ పర్యటనలో ఉండే సరికి.. ఇక్కడ జరిగే విపరిణామాలనుంచి ప్రభుత్వాన్ని కాపాడడానికి అందరూ ఎవరికి వారు తమ టేలెంట్‌ ప్రూవ్‌ చేసుకోవాలని ఉత్సాహ పడుతున్నట్లుగ ఉంది.