Begin typing your search above and press return to search.

ఓరి: సక్కంగున్నా సహించరా?

By:  Tupaki Desk   |   24 Oct 2015 10:17 AM GMT
ఓరి: సక్కంగున్నా సహించరా?
X
సామాన్యుడికి పెద్ద సందేహమే వచ్చేసింది. నిన్న మొన్నటివరకూ ఏ నిమిషాన ఏ ముంచుకొస్తుందోనని దడదడలాడిపోతున్న తెలుగోళ్లు ఈ మధ్యనే కాస్త కుదురుకుంటున్నారు. విభజన నేపథ్యంలో ఇద్దరి చంద్రుళ్ల మద్య ఓపెన్ వార్ జరగటం.. ఎవరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక కిందామీదా పడిపోయే పరిస్థితి. ఇద్దరు అధినేతలు బాగానే ఉన్నా.. ఎపెక్ట్ పడేది మాత్రం సాదాసీదా జనాల మీదనే. ఆ మధ్యన 1200 మంది విద్యుత్తు అధికారుల్ని ఒక్క జీవోతో ఏపీకి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటే.. ఏపీ సర్కారు మాకు సంబంధమే లేదని తేల్చేసింది. దీంతో.. అటు తెలంగాణకు కాకుండా ఇటు ఆంధ్రాకు కాకుండా ఏం చేయాలో దిక్కుతోచక ఉండిపోయారు. ఈ ఎపిసోడ్ లో దాదాపు మూడు నాలుగు నెలల పాటు జీతాల్లేక ఆయా కుటుంబాలు ఎన్నెన్ని కష్టాలు పడ్డాయో వారికి.. వారి సంబంధీకులకు మాత్రమే తెలుసు.

ఇంత జరిగినా.. ఈ విషయం మీద మాట్లాడేందుకు ముఖ్యమంత్రులు ససేమిరా అన్న పరిస్థితి. చివరకు కిందామీదా పడి హైకోర్టు.. సుప్రీంకోర్టు.. కేంద్రం ఇలానే ఎక్కిన గుమ్మం.. దిగిన గుమ్మంతో వారు విసిగి వేసారిపోయి.. చివరకు హైకోర్టు నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం వారిని తెలంగాణ క్యాడర్ లోనే ఉంచాలని.. కాకుండా జీతాలు రెండు రాష్ట్రాలు పంచుకోవాలంటూ నిర్ణయం ప్రకటించారు.

ఇదొక ఉదాహరణ లాంటిదే. ఇలాంటివెన్నో తలనొప్పులు విభజన కారణంగా చోటుచేసుకున్నాయి. ఇరువురు అధినేత మధ్య నడుస్తున్న వార్ తో వాతావరణం చల్లబడే పరిస్థితి లేకపోవటంతో.. ఏ నిమిషాన ఏ నిర్ణయం వెలువడుతుంది? దానికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఇద్దరు ముఖ్యమంత్రులు నవ్వుతూ ఒకరినికొకరు మర్యాద ఇచ్చుపుచ్చుకుంటున్నారు. ఇరువురి మధ్య మాటల్లేని పరిస్థితుల్లో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ను చంద్రబాబు ఆహ్వానించటం.. దానికి ఆయన ఓకే చెప్పేసి రావటం.. వచ్చిన కేసీఆర్ ను చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని తిరిగి పంపించటం తెలిసిన అంశాలే.

ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సామరస్యం లేకుండా కొట్టుకునే సమయంలో వారిని కలపటానికి కానీ.. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు లేకుండా చేయటానికి జరిగిన ప్రయత్నాలు చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఇద్దరు నేతలు కలిసిన తర్వాత మాత్రంఇప్పుడు తెలంగాణ.. ఏపీ విపక్ష నేతలు కిందామీదా పడిపోతున్నారు. కేసీఆర్.. చంద్రబాబుల మధ్య సంబంధాలకు సరికొత్త అర్థాలు తీస్తున్నారు. పలు ఆరోపణలు చేస్తున్నారు. వీరందరి తీరు చూసిన సామాన్యుడికి పెద్ద సందేహమే వస్తోంది. ఇద్దరూ కొట్టుకున్నప్పుడు సినిమా చూస్తున్నట్లు ఉండిపోయిన విపక్షాలు.. ఇప్పుడు ఇద్దరు చంద్రుళ్లు సామరస్యంగా ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. సక్కంగున్నా కూడా సహించలేకపోతున్నారే అని సామాన్యుడు వాపోతున్నాడు.