Begin typing your search above and press return to search.

బెజ‌వాడ‌లో పార్టీల పోటాపోటీ నిర‌స‌న‌లు

By:  Tupaki Desk   |   26 Aug 2015 9:28 AM GMT
బెజ‌వాడ‌లో పార్టీల పోటాపోటీ నిర‌స‌న‌లు
X
ఏపీ తాత్కాలిక రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో రాజ‌కీయ పార్టీల పోటాపోటీ ధ‌ర్నాల‌తో.. నినాదాల‌తో హోరెత్తుతోంది. రాజ‌ధానిగా ఉన్న ప్రాంతంలో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌న్న విష‌యం తెలిసిందే. గ‌తంలో ఏ విష‌యం పైన అయినా.. ధ‌ర్నా.. ఆందోళ‌న చేయాలంటే హైద‌రాబాద్ మీద దృష్టి సారించేవారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో బెజ‌వాడపై ఏపీ నేత‌ల ఫోక‌స్ పెరిగింది.

దీనికి తోడు గ‌త కొద్దిరోజులుగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లోనే ఉండి పాల‌న సాగించ‌టంతో రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌మ ఆందోళ‌న‌లు.. రాజ‌కీయ కార్య‌క‌లాపాల్ని విజ‌య‌వాడ‌లో ముమ్మ‌రం చేశాయి.

బుధ‌వారం బెజ‌వాడ‌లో ప‌రిస్థితి చూస్తే.. ప్ర‌ధాన విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ తో పాటు.. అధికార‌ప‌క్షం తెలుగుదేశం కూడా పోటాపోటీ ధ‌ర్నాలు చేప్ట‌ట‌టంతో ప‌రిస్తితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఏపీ రాజ‌ధానిలో రైతుల భూముల సేక‌ర‌ణ‌ను వెంట‌నే నిలిపివేయాలంటూ సీఆర్‌ డీఏ కార్యాల‌యం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ స్వ‌యంగా ధ‌ర్నాకు దిగారు. దీంతో.. ఆ పార్టీ నేత‌లు భారీగా విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు.

మ‌రోవైపు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా వెంట‌నే ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత‌లు దేవినేని నెహ్రు.. మ‌ల్లాది విష్ణు త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్‌.. కాంగ్రెస్ నేత‌లు పోటాపోటీగా వేర్వేరు అంశాల మీద ధ‌ర్నా చేయ‌టంతో.. అధికార‌ప‌క్షం నేత‌లు రంగంలోకి దిగారు. విప‌క్షాలు చేస్తున్న ధ‌ర్నాలు అర్థం లేనివంటూ ఆ పార్టీ నేత‌లు కార్పొరేష‌న్ కార్యాల‌యం వ‌ద్ద‌నున్న గాంధీ విగ్ర‌హానికి పాలాభిషేకం చేయ‌ట‌మే కాదు.. ధ‌ర్నా నిర్వ‌హించారు. మొత్తానికి.. మూడు ప్ర‌ధాన పార్టీ నేత‌లు ఒకేరోజు ధ‌ర్నాకు దిగ‌టంతో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూసేందుకు పోలీసుల‌కు త‌ల‌ప్రాణం తోక‌కు వ‌స్తోంది.