Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో బంద్ అదిరిపోవాలంట

By:  Tupaki Desk   |   8 Oct 2015 9:05 AM GMT
గ్రేటర్ లో బంద్ అదిరిపోవాలంట
X
తెలంగాణ అధికారపక్షానికి వ్యతిరేకంగా విపక్షాలు చేతులు కలిపాయి. రైతుల ఆత్మహత్యల నివారణకు.. రైతుల రుణమాఫీని ఏకమొత్తంలో మినహాయించాలని కోరుతూ.. ప్రభుత్వానికి అల్టిమేటం విధించి విపక్షాలు.. ఈ నెల 10న బంద్ పక్కా అన్న విషయాన్ని తేల్చేశాయి.

తాజాగా.. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో సమావేశమైన కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీ పార్టీ నేతలంతా కలిసి పదో తేదీన జరిపే బంద్ ను ఏ విధంగా నిర్వహించాలన్న విషయంపై సీరియస్ గా చర్చలు జరిపారు. విపక్షాలన్నీ కలిపి చేస్తున్న ఈ బంద్ ప్రభావం భారీగా ఉండాలని.. ఆ విషయంలో ఏ మాత్రం తప్పులు దొర్లినా.. తమ పరపతిపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాన్ని పార్టీలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

బంద్ విషయంలో విపక్షాలన్నీ ఒకే బాటలో కలిసి చేపడుతున్న నేపథ్యంలో.. దాని తీవ్రత భారీగా ఉండాలని డిసైడ్ చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బంద్ తీవ్రత ఎక్కువగా ఉండాలని.. హైదరాబాద్ లో జరిగిన బంద్ ప్రభావం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతుందని.. మీడియాలోనూ భారీగా ప్రచారం లభిస్తుందన్న మాటను విపక్ష నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బంద్ నాడు గ్రేటర్ జీవనం స్తంభించిపోయేలా చర్యలు తీసుకోవాలని.. అప్పుడే విపక్షాల సత్తా తెలుస్తుందని భావిస్తున్నారు. చూస్తుంటే.. గ్రేటర్ హైదరాబాద్ లో బంద్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.