Begin typing your search above and press return to search.

జాతీయ కూటమి ఎందుకు కలవడం లేదు..!?

By:  Tupaki Desk   |   21 Nov 2018 7:37 AM GMT
జాతీయ కూటమి ఎందుకు కలవడం లేదు..!?
X
కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని అన్నీ రాజకీయ పార్టీలను కలుపుకుని కూటమి ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. ఇందుకోసం ఆయన దక్షిణాది రాష్ట్రాలన, ఉత్తరాది రాష్ట్రాలను కలియ తిరుగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు కర్ణాటకలో మాజీ ప్రధాని దేవగౌడను - తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ ను - పశ్చిమ బెంగాల్‌ లో ముఖ్యమంత్రి మమతా బేనర్టీని కలుసుకున్నారు. జాతీయ కూటమిలో కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఆ పార్టీతో కలసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించాలన్నది ఈ మహాకూటమి లక్ష్యం. జాతీయ స్దాయిలో ప్రధాని నరేంద్ర మోదీని సమర్దవంతంగా ఎదుర్కునేందుకు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలన్నది చంద్రబాబు వ్యూహం. ఇందుకోసం దశాబ్దాల వైరాన్ని కూడా చంద్రబాబు ప్రక్కన పెడుతున్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో కలవడమే కాకుండా మమతా బేనర్జీని వామపక్షాలతో కలిసేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారంలోనే అన్ని పార్టీలతో కలసి ఓ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఈ వారంలో జరగాల్సిన సమావేశమే జనవరి వరకూ పోస్ట్‌ పోన్ అయ్యింది. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటి అనేది చర్చనీయంశం అయ్యింది. పార్లమెంటు సమావేశాల సంధర్భంగా అన్నీ పార్టీలు సమావేశం అవుతాయని పైకి ప్రకటించిన దాని అంతరార్దం మాత్రం వేరే ఉందంటున్నారు. డిశంబరు నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ - రాజాస్థాన్ - మిజోరాం ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌ గడ్ ఎన్నికలు కూడా మంగళవారం ముగిసాయి. ఈ రాష్ట్రాల ఫలితాలు డిశంబరు 11న వెల్లడవుతాయి. ఈ ఫలితాలలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో వెల్లడవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌ గా పేర్కుంటున్న ఈ రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ - కాంగ్రెస్‌ తో పాటు పలు ప్రాంతీయ పార్టీల బలం కూడా వెల్లడవుతుంది. వాటిన్ననింటినీ బేరీజు వేసుకుని బీజీపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలా లేక విడివిడిగానే ఉండాల అన్నది నిర్ణయిస్తారని సమాచారం. ఇందుకు కారణం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటున్నారు. తాను బలహీనంగా ఉన్న సమయంలో ఇతరులతో కలవడం - బలపడే సమయంలో వదిలివేయడం చంద్రబాబు నైజం. ఇప్పుడే కూటమిని ఏర్పాటు చేస్తే ఇతర పక్షాలతో కలసి తాను బలవంతుడనేనని చంద్రబాబు రెచ్చిపోతారని పలువురి నాయకుల అభిప్రాయం. అలా కాకుండా ఈ రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడయ్యాక ఓ నిర్ణయానికి వస్తే చంద్రబాబు తమ చెప్పుచేతలలో ఉంటాడని కూటమిలోని ఇతర పక్షాల నాయకుల అభిప్రాయం. ఈ కారణంగానే ఈ నెలలో జరగాల్సిన సమావేశాన్ని జనవరిలో జరిపేందుకు నిర్ణయించారని చెబుతున్నారు.