Begin typing your search above and press return to search.

విభజన పాపం బీజేపీ, టీడీపీలదే

By:  Tupaki Desk   |   14 Aug 2015 11:31 AM GMT
విభజన పాపం బీజేపీ, టీడీపీలదే
X
ఆంధ్రప్రదేశ్ ను విభజించిన పాపం కాంగ్రెస్ దని, ఈ కుట్రలో వైసీపీ, టీఆర్ ఎస్ భాగస్వాములని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చరిత్రను ఆయన వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నాయి. విభజన పాపం తొలుత బీజేపీది అయితే ఆ తర్వాత టీడీపీదేనని వివరిస్తున్నాయి.

ఆంద్రప్రదేశ్ ను విభజించాలని, తెలంగాణను ఏర్పాటు చేయాలని బీజేపీ తొలి నుంచీ డిమాండ్ చేస్తోంది. 1994లోనే ఆ పార్టీ కాకినాడలో తీర్మానం చేసింది. అప్పటికి టీఆర్ ఎస్ ఏర్పడలేదు కూడా. ఇక, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసేటప్పుడు కూడా ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. సీమాంధ్రకు ఎటువంటి డిమాండ్లు అడగకుండా కేవలం ప్రత్యేక హోదా అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు.

ఇక, కాంగ్రెస్ - వైసీపీ - సీపీఎం - సీపీఐ తదితర పార్టీలన్నిటికంటే కూడా విభజనకు ముందుగా అంగీకరించింది ఒక్క టీడీపీ పార్టీయేనని గుర్తు చేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి 2009కి ముందే టీడీపీ జై తెలంగాణ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలకు తాము తప్పు చేసినా ఎదుటి వారి మీద ఎదురు దాడి చేయడం అలవాటైందని, విభజనకు టీడీపీ కారణం అయితే దానిని ఇతర పార్టీల మీదకు నెట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు అంటూ.. రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చి.. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయలేని స్థితిలో టీడీపీ విభజనకు అంగీకరించిందని, రాష్ట్రం విడిపోతే జగన్ కు చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతోనే తెర వెనుక విభజనకు అనుకూలంగా పావులు కదిపారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు.