Begin typing your search above and press return to search.

చెప్పుల భాషకు కేటీఆర్ కు కౌంటర్ పడింది

By:  Tupaki Desk   |   5 April 2017 5:26 PM GMT
చెప్పుల భాషకు కేటీఆర్ కు కౌంటర్ పడింది
X
స‌రైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు రాజ‌కీయ నేత‌లు. ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డే ఏ చిన్న అవ‌కాశం ల‌భించినా.. చెల‌రేగిపోతారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. పండ‌గ రోజు అని కూడా చూడ‌కుండా నేత‌లు చెల‌రేగిపోయారు. నిన్న‌న (మంగ‌ళ‌వారం) మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంచం అడిగినోళ్ల‌ను చెప్పుతో కొట్ట‌మంటూ ప్ర‌జ‌ల‌కు చెప్పేశారు. సినిమాటిక్ గా కేటీఆర్ చెప్పిన డైలాగ్ విన్నంత‌నే.. చుట్టూ ఉన్నోళ్లంతా చ‌ప్ప‌ట్లు కొట్టేసి కేటీఆర్‌ను అభినందించేశారు. కానీ.. ప్ర‌జాజీవితంలో ఉన్న వారు.. అందునా మంత్రి లాంటి కీల‌క స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలే కానీ.. లంచం అడిగేటోళ్ల‌ను చెప్పుల‌తో కొట్టేయాలంటూ జ‌నాల‌కు పిలుపునివ్వ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న విమ‌ర్శ వినిపించింది.

దీనికి త‌గ్గ‌ట్లే ఈ రోజు పార్టీల‌కు అతీతంగా ప‌లువురు నేత‌లు కేటీఆర్ చెప్పు మాట‌ల‌తో తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కేటీఆర్‌పై విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించే య‌త్నంలో.. నేత‌లు త‌మ శ‌క్తిమేర‌కు చెప్పు భాష‌ను మ్యాగ్జిమమ్ తీసుకొచ్చార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బీజేపీ సీనియ‌ర్ నేత ఇంద్ర‌సేనా రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్యంలో విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం తీవ్ర‌మైన నేర‌మ‌ని.. ప్ర‌జాప్ర‌తినిధులే రెచ్చ‌గొట్టేలా మాట్లాడ‌టం తీవ్ర‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. డ‌బ్బులు అడిగినోళ్ల‌ను చెప్పుతో కొట్టాల‌న్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఖండించిన ఆయ‌న‌.. ఎదుటివారిపై దాడి చేయ‌మ‌ని చెప్ప‌టం కూడా నేర‌మేన‌ని.. దాడి చేసిన వారి కంటే దాడి చేయ‌మ‌ని ప్రోత్స‌హించిన వారే చ‌ట్టం దృష్టిలో మొద‌టి నేర‌స్థుల‌వుతార‌న్నారు. ముఖ్య‌మంత్రి కుమారుడే.. రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. కేటీఆర్ లాంటి వారి మాట‌లు న‌మ్మి.. ఆవేశంగా వ్య‌వ‌హ‌రించి కేసుల్లో ఇరుక్కోవ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు.

ఇక‌.. తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు త‌న‌దైన శైలిలో కేటీఆర్ చెప్పు మాట‌ల‌కు కౌంట‌ర్ ఏసేశారు. లంచం అడిగితే చెప్పుతో కొట్టాల‌న్న కేటీఆర్ మాట స్వాగ‌తించొచ్చ‌ని.. ఎన్నిక‌ల వాగ్దానాల్ని మ‌ర్చిపోయి అబ‌ద్ధాలు.. మోసం చేసిన వారిని కూడా చెప్పుతో కొట్టాలంటూ ఫైర్ అయ్యారు. అవినీతి కంటే కూడా ఇచ్చిన మాట త‌ప్ప‌ట‌మ‌ని.. తెలంగాణ వ‌స్తే మొద‌టి ముఖ్య‌మంత్రి ద‌ళితుడే అవుతాడ‌ని చెప్పిన ముఖ్య‌మంత్రి మాట ఏమైందంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నించారు.

కేటీఆర్ చెప్పు మాట‌పై టీడీపీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రి కుమారుడు.. మంత్రిగా ఉన్న కేటీఆర్ లాంటి వ్య‌క్తి.. లంచం అడిగిన వారిని చెప్పుతో కొట్ట‌మ‌ని చెప్ప‌టం ఆశ్చ‌ర్యంగా ఉంద‌న్నారు. తెలంగాణ‌లో ఏ చిన్న ప‌ని కావాల‌న్నా డ‌బ్బులు ఇవ్వందే ప‌ని జ‌ర‌గ‌ట్లేద‌ని.. గొంగ‌ట్లో తింటూ వెంట్రుక‌లు ఉన్నాయ‌న్న‌ట్లుగా తెలంగాణ అధికార‌ప‌క్ష నేత‌ల మాట‌లు ఉన్నాయ‌న్నారు. మిష‌న్ కాక‌తీయ‌లో అవినీతి జ‌ర‌గ‌కుంటే.. అంత‌మంది అధికారులు ఎందుకు స‌స్పెండ్ అయ్యార‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. ఉద్యోగాల కోసం సీఎంవోలోని వ్య‌క్తుల‌కు రూ.40 ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లుగా స‌తీష్ రెడ్డి అనే వ్య‌క్తి చెప్ప‌టాన్ని ఈ సంద‌ర్భంగా రావుల గుర్తు చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/