Begin typing your search above and press return to search.

జేడీఎస్ కు షాక్... కర్నాటకలో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

By:  Tupaki Desk   |   9 March 2020 2:30 PM GMT
జేడీఎస్ కు షాక్... కర్నాటకలో మళ్లీ ఆపరేషన్‌ ఆకర్ష్‌
X
అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు సొంతం చేసుకున్నా సంకీర్ణంలో కింగ్‌ మేకర్‌ కావడంతో ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి కొన్నాళ్లు కొనసాగిన పార్టీ ఆ తర్వాత మొదలైన రాజకీయ చట్రంలో తిరిగి తన యథాస్థానానికి చేరింది. అధికారం కోల్పోయిన తర్వాత గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో దారుణ ఫలితాలు రావడంతో ఆ పార్టీ ప్రస్తుతం కోలుకోని పరిస్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితి లో దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ అంశం తెరపైకి వచ్చింది. ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీ ఎర వేస్తుందని ప్రచారం కర్నాటకలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో జేడీఎస్‌ కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం జేడీఎస్ లో ఉండలేక, వెళ్లలేక సతమతమవుతున్న ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. పార్టీ అధినేతల వైఖరి నచ్చక చాలామంది నాయకులు పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అసమ్మతి పర్వం రూపంలో పలువురు ఎమ్మెల్యేలు దూరం కాగా ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ నాయకులు పార్టీకి బైబై చెప్పే ఆలోచన లో ఉన్నారంట. ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, మరో నేత మధు బంగారప్ప కూడా త్వరలోనే పార్టీ వీడుతారని కర్నాటకలో ప్రచారం సాగుతోంది. వీరితో పాటు తుమకూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీకి రాజీనామా యోచనలో ఉన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే కర్నాటకలోని దక్షిణాది జిల్లాల్లో బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్ చేపట్టే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను చేర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రస్తుతం జేడీఎస్‌ బలం దక్షిణ కర్ణాటక లో కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఉత్తర కర్ణాటకలో ఏ జిల్లాలో పార్టీకి బలమైన నాయకులు లేని పరిస్థితి. దీంతో జేడీఎస్ ను దక్షిణాది జిల్లాల్లో కూడా దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. జేడీఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల మాజీ మంత్రి జీటీ దేవెగౌడ వ్యాఖ్యానించడంతో ఈ పుకార్లకు బలం చేకూరుతోంది.

అయితే మధు బంగారప్ప, జీటీ దేవెగౌడ పార్టీని వీడుతారనే ప్రచారం రావడం తో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ రంగంలోకి దిగారని తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ మంత్రి జీటీ దేవెగౌడ జేడీఎస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటీవల పార్టీ ప్రముఖులతో సమావేశమై దీనిపై చర్చించారని సమాచారం. వారిని బుజ్జగించినా పార్టీ నాయకుల్లో మార్పు రాలేదని, సానుభూతి అంశం కూడా ఫలించలేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ రమేశ్‌బాబు జేడీఎస్‌ కు రాజీనామా చేశారు.

ఇక ఈ రాజీనామాలపై పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ స్పందించారు. రాజకీయ పార్టీ అంటేనే నాయకులు వస్తుంటారు.. పోతుంటారు... వెళ్లే వారి గురించి పట్టించుకోవాల్సిన పని లేదని పేర్కొన్నారు. తమ పార్టీకి ఇది కొత్తేమీ కాదని లైట్ గా తీసుకున్నారు. వారు పోతే ఏంటి పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కదా అని సర్ది చెప్పుకున్నారు.