Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఇంచార్జీగా డిగ్గీ ఔట్‌..రంగంలోకి మాజీ సీఎం

By:  Tupaki Desk   |   28 Jun 2016 5:41 AM GMT
కాంగ్రెస్ ఇంచార్జీగా డిగ్గీ ఔట్‌..రంగంలోకి మాజీ సీఎం
X
రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత ఇన్‌ చార్జి - పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ ను త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. దిగ్విజయ్‌ ను తప్పించాలంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ కు చెందిన పలువురు సీనియర్ - జూనియర్లు చాలాకాలంగా సోనియా - రాహుల్‌ ను కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జిగా కేరళ మాజీ సిఎం ఊమన్ చాందీని నియమించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ యోచిస్తున్నట్టు తెలిసింది.

పార్టీ సీనియర్ నేత‌ - ఎంపీ పాల్వాయి గోవర్దన్ రెడ్డి సోనియాను కలిసి దిగ్విజయ్‌ ని తప్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ - ఆంధ్రలో కాంగ్రెస్ దెబ్బతినడానికి ఆయనే కారణమని వివరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు - కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోని ఇప్పటికే రెండు మూడుసార్లు ఊమెన్ చాందీతో తెలంగాణ ఇన్‌ చార్జి బాధ్యతలు చేపట్టటం గురించి చర్చించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఊమెన్ చాందీ పచ్చజెండా ఊపగానే ఆయనను తెలంగాణ ఇన్‌ చార్జిగా నియమిస్తూ ప్రకటన జారీ అవుతుందని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి. తెలంగాణ సీఎల్పీ నేతగా కె జానారెడ్డిని సైతం తప్పించాలని గోవర్దన్ రెడ్డి హైకమాండ్‌ ను కోరినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జానారెడ్డి చేత సీఎల్పీ నాయకత్వ పదవికి రాజీనామా చేయిస్తుందనే మాట వినిపిస్తోంది.

ఇటీవ‌ల కేర‌ళ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఉమెన్ చాందీ ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. సోలార్ కుంభ‌కోణంలో కూరుకుపోవ‌డం , చాందీ స‌హా ఆయ‌న కుమారుడు కూడా ఓ సినీన‌టితో ఈ వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డం క‌ల‌క‌లం రేకెత్తించింది.