Begin typing your search above and press return to search.

కాల్చేయండి.. చంపేయండి.. నిద్రలో యువత పలవరింతలు.. అంతా పబ్జీ మాయ!

By:  Tupaki Desk   |   23 Oct 2020 12:30 AM GMT
కాల్చేయండి.. చంపేయండి.. నిద్రలో యువత పలవరింతలు.. అంతా పబ్జీ మాయ!
X
యువతకు ఆన్​లైన్​ గేమ్స్​ ఎంతో ప్రమాదకరంగా మారాయి. వారి మానసిక ఆరోగ్యాన్ని, సమయాన్ని వృథా చేస్తున్నాయి. ఈ ఆన్​లైన్​ గేమ్స్​ బానిసలై ఇప్పటికే అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం పబ్జీ లాంటి గేమ్​ను నిషేధించినప్పటికీ ఇతర సర్వర్లలో ఆ గేమ్​ ఇంకా అందుబాటులో ఉంది. యువతను మానసిక రోగులుగా మారుస్తున్న కొన్ని కంపెనీలు రూ.కోట్లు దండుకుంటున్నాయి. హైస్కూల్​ విద్యార్థుల నుంచి బీటెక్ చదివే విద్యార్థుల వరకు ఈ గేమ్​కు బానిసలవుతున్నారు.

తల్లిదండ్రులకు తెలియకుండా రూ.వేలకు వేలు తగలేస్తున్నారు. తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న పోక్‌మాన్, నిన్న బ్లూవేల్స్, ఇప్పుడు పబ్‌జీ, ఫ్రీ ఫైర్‌ గేమ్స్‌ విద్యార్థులను, యువతను వెర్రెక్కించి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. ప్రభుత్వాలు కొన్ని గేమ్స్‌ను బ్యాన్‌ చేసినా, కొన్ని సర్వర్ల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని వేలాది మంది డేంజర్‌గేమ్స్‌లో భాగస్వాములు కావడం గమనార్హం.

పబ్​జీ

దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ కంపెనీ పబ్‌జీ గేమ్​ను తీసుకొచ్చింది. గేమ్‌ను సింగిల్‌గా లేదా గ్రూప్‌గా ఆడొచ్చు. గేమ్‌లో 100 మంది వరకూ ఉంటారు. ఆడేవారు తప్ప మిగిలిన వారంతా శత్రువులు గానే లెక్క. గేమ్‌ని వార్‌ ఫీల్డ్‌లా భావించి ఎదురుపడ్డ పోటీదారులను చంపుకుంటూ పోవాలి. మిగిలిన వాడు విజేత. ఇందులో మనం ఎంచుకున్న ఆటగాడికి కావాల్సిన దుస్తులు, ఆయుధాలు, బాంబులు, బంకర్లు, మెడికల్‌ కిట్లు అన్నీ అమ్మకానికి ఉంటాయి. చనిపోయిన ప్రతిసారి వేల రూపాయలు ఖర్చుపెట్టి అందులోకి ప్రవేశించేందుకు యువత తహతహ లాడుతున్నారు.

కొంపముంచుతున్న ఆన్​లైన్​ పాఠాలు

కరోనా లాక్​డౌన్​తో పాఠశాలల మూతబడ్డాయి. ఇందుకోసం తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్​ ఫోన్లు కొనిస్తున్నారు. అంతేకాక డాటా కూడా వేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఖాళీ సమయాల్లో అశ్లీల వీడియోలు చూడటంతో పాటు ఇటువంటి గేమ్స్​ ఆడుతూ డబ్బు, సమయం వృథా చేసుకుంటున్నారు.