Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ పందేలకు అడ్డుకట్టే లేదా?

By:  Tupaki Desk   |   26 Feb 2016 10:30 PM GMT
ఆన్ లైన్ పందేలకు అడ్డుకట్టే లేదా?
X
భారత్ లో జూదం, పందేలు చట్ట విరుద్ధమన్న సంగతి తెలిసిందే. అయితే... బయట చేయలేని చాలాపనులు ఆన్ లైన్లో చేస్తున్నట్లే బెట్టింగులకూ ఆన్ లైనే వేదికవుతోంది. ఆన్ లైన్లో బెట్టింగ్ చట్ట విరుద్ధం అని చెప్పదగిన నిర్దిష్ట చట్టాలు లేకపోవడమే అందుకు కారణం. దీంతో ఇప్పుడు ఆన్ లైన్లో బెట్టింగ్ అనేది బహిరంగంగా సాగుతోంది. ఇలాంటి బెట్టింగుల్లో ఐపీఎల్ బెట్టింగులే టాప్ లో ఉంటున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో ఆన్ లైన్లో భారీ ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి.

ఇండియాబెట్.కామ్ వంటి వెబ్ సైట్ల వేదికగా బెట్టింగు కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇండియాబెట్.కామ్ మాత్రం తాము పందేలా స్వీకరించమని... ఇంటర్నేషనల్ గా ఆన్ లైన్ బుకీలతో కనెక్టయ్యేలా మాత్రమే సహకరిస్తామని చెబుతోంది.

ఆన్ లైన్ బెట్టింగులు ఆఫర్ చేసే వెబ్ సైట్లలో తొలుత రిజిస్ర్టేషన్ చేసుకోవాలి... అనంతరం అందులో ఐపీఎల్ సెక్షన్ కు వెళ్తే అక్కడ మొత్తం మ్యాచ్ ల వివరాలన్నీ ఉంటాయి. అందులో అప్పటికి జరుగుతున్న ఏ ఆటపై పందెం కాయాలన్నది నిర్ణయిం​​చుకోవాలి. కేవలం మ్యాచ్ ఫలితంపైనే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారన్న చోట మొదలుపెట్టి బాల్ టు బాల్ పందేలు నడుస్తుంటాయి. ఆ బంతికి వికెట్ పడుతుందా... ఎన్ని రన్స్ తీస్తారు... డాట్ బాలా? రన్నవుట్ అవుతారా.? వంటి అన్ని ఆప్షన్లపై బెట్టింగులు నడుస్తుంటాయి.

ఇండియాబెట్.కామ్ లో ఆన్ లైన్ బెట్టింగు ఏజెన్సీల వివరాలూ అందుబాటులో ఉన్నాయి. విలియం హిల్ - బెట్365 - లాడ్ బ్రోక్స్ - బెట్ ఫెయిర్ వంటి ఏజెన్సీల వివరాలు అందులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకుని బెట్టింగులో పాల్గొనడం ఎలా అన్నది ఇందులో వీడియో రూపంలో కూడా అందుబాటులో ఉంది.

1867 నాటి పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం ఇండియాలో అన్ని రకాల జూదాలు - పందేలపై నిషేధం ఉంది. అయితే... అమెరికా వంటి దేశాల్లో ఉన్నట్లు ఇంటర్నెట్ గాంబ్లింగ్ నిషేధ చట్టం అంటూ నిర్దిష్ఠంగా ఏమీ లేదు. దేశంలోని సిక్కిం వంటి రాష్ట్రాలు మాత్రం ఇలాంటి ఆన్ లైన్ వ్యవహారాలపై పరిమితంగా నిషేధం విధించాయి. 2009లో అక్కడ సిక్కిం ఆన్ లైన్ గేమింగ్ రెగ్యులేషన్ రూల్స్ తీసుకొచ్చారు. మరోవైపు విదేశీ సైట్లలో ఆన్ లైన్ గాంబ్లింగ్ చేసినప్పుడుపట్టుకోవడం కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పందెం ఆడింది ఇండియా నుంచే అయినా వెబ్ సైట్ ఇతర దేశంలో ఉన్నందున.. అక్కడి చట్టాలు ఆన్ లైన్ బెట్టింగును పెర్మిట్ చేస్తే ఏమీ చేయలేమని అంటున్నారు. ఇప్పుడీ బెట్టింగు సైట్ల లో ఆన్ లైన్ బెట్టింగులు కాస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.