Begin typing your search above and press return to search.

మరో నెల ఆగితే ఉల్లి ధర అక్కడికి వెళుతుందట!

By:  Tupaki Desk   |   7 Jan 2020 11:04 AM GMT
మరో నెల ఆగితే ఉల్లి ధర అక్కడికి వెళుతుందట!
X
రెండు.. మూడు నెలలుగా దేశ ప్రజల్ని ఉల్లి ధరలు ఎంతగా ఏడిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వంటలో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయ ధర భారీగా పెరిగిపోవటం.. ఒక దశలో కేజీ రూ.200 వరకూ వెళ్లిపోవటంతో పేద.. మధ్య తరగతికి చెందిన వారు మాత్రమే కాదు.. సంపన్నులు సైతం కిందామీదా పడ్డారు. ఇక.. పెరిగిన ఉల్లి ధరల కారణంగా హోటల్.. రెస్టారెంట్ వ్యాపారస్తుల మీద భారం భారీగా పడింది. వారంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఉల్లి ధరల ఘాటు ప్రభుత్వాలను తాకటమే కాదు.. పలు ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఉల్లి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తూ ప్రజాగ్రహాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. దేశంలో మరెక్కడా లేని రీతిలో ఏపీలో తొలుత కేజీ ఉల్లి రూ.50కు.. తర్వాత కేజీ రూ.25కు ఉల్లి కౌంటర్ల ద్వారా సరఫరా చేయటం జరిగింది.

ఇదిలా ఉంటే.. మొన్నటివరకూ బహిరంగ మార్కెట్లలో ఉల్లి ధరలతో చుక్కలు కనిపించిన ప్రజానీకానికి ఇప్పుడు కాస్తంత ఉపశమనం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త పంట చేతికి రావటం.. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులు పెరుగుతుండటంతో ధరలు ఆకాశం నుంచి కిందికి దిగి వస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలు.. రాయచూరు హోల్ సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.35కు పడిపోయినట్లుచెబుతున్నారు.

మరోవైపు మహారాష్ట్ర నుంచి పంట వచ్చేయటంతో ధరలు మరింతగా తగ్గనున్నాయి. మొన్నటి వరకూ రిటైల్ మార్కెట్లో రూ.100 పలికిన కిలో ఉల్లి.. ఇప్పుడు కేజీ రూ.50కు దిగి వచ్చాయి. రానున్న మూడు వారాల్లో ఈ ధర మరింత తగ్గే వీలుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. అన్ని చోట్ల కొత్త పంట అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి మొదటివారానికి రిటైల్ మార్కెట్లో కేజీ రూ.20 వరకు ఉల్లి ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని దిండిగల్ తదితర ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ.20కు పడిపోవటం గమనార్హం.