Begin typing your search above and press return to search.

మరోసారి భారీగా పెరగున్న ఉల్లి ..ఎందుకంటే?

By:  Tupaki Desk   |   25 Dec 2019 9:21 AM GMT
మరోసారి భారీగా పెరగున్న ఉల్లి ..ఎందుకంటే?
X
గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకే ధరలతో కొనడానికే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి, కొద్దిరోజులుగా మెల్లి మెల్లిగా కిందకి దిగి వస్తుండటంతో సామాన్యులు ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఈ ఆనందం ఎక్కువ రోజులు ఉండేలా కనిపించడం లేదు. అతి త్వరలో ఈ ఆనందం మళ్లీ ఆవిరయ్యేలా కన్పిస్తోంది. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు 10 నుంచి 15 శాతం మళ్లీ పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి గల ప్రధాన కారణం .. టర్కీ భారత్‌ కు ఉల్లి ఎగుమతులు నిలిపివేయడమే.

మన దేశంలో ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఇటీవల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ధరలను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగానే టర్కీ - ఈజిప్టు లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతులు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారత్‌ 7,070 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోగా.. దీనిలో 50శాతం టర్కీ నుంచి వచ్చిందేనని వ్యాపార వర్గాలు తెలిపాయి. అయితే, ఎగుమతుల కారణంగా టర్కీలో కూడా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయని తెలుస్తుంది.

దీంతో భారత్‌ కు ఉల్లి ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మనలాగే టర్కీ కూడా ధరల నియంత్రణ కోసం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది అని మహారాష్ట్రలోని నాసిక్‌ కు చెందిన హోల్‌ సేల్‌ ఏజెంట్‌ తెలిపారు. దీంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడే అవకాశముంది.ఎందుకంటే దేశీయంగా పండించిన ఉల్లి ఇప్పుడే మార్కెట్లోకి రాదు. అప్పటిదాకా ధరలు పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒకసారి దేశీయ దిగుబడులు వచ్చిన తర్వాత ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఏదేమైనా సామాన్యులకు ఉల్లిభారం ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.