Begin typing your search above and press return to search.

మోదీకి షాక్‌ ఇచ్చిన ఒంగోలు రైతులు

By:  Tupaki Desk   |   26 April 2019 9:54 PM IST
మోదీకి షాక్‌ ఇచ్చిన ఒంగోలు రైతులు
X
మోదీకి షాక్‌ మీద షాక్‌ లు తగులుతున్నాయి. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా కాశీ నుంచి పోటీ చేసేందుకు నిజామాబాద్‌ ఇందూరు రైతులు వారణాసి చేరుకున్నారు. ఇప్పుడు వీరికితోడు.. మరో ఇద్దరు రైతులు మోదీకి పోటీగా వారణాసి నుంచి పోటీకి దిగారు. ఈ ఇద్దరు తెలుగు వాళ్లు కావడం ఇక్కడి విశేషం. వెలిగొండ ప్రాజెక్ట్‌ ని పూర్తి చేసి, ఫ్లొరైడ్‌ సమస్యని దూరం చేయాలని లక్ష్యంతోనే మోదీకి వ్యతిరేకంగా ఎంపీగా పోటీ చేస్తున్నామని ప్రకటించారు ఇద్దరు తెలుగు రైతులు.

వివరాల్లోకి వెళ్తే.. మొన్నటికి మొన్న కేసీఆర్‌ కుమార్తె కవితకు వ్యతిరేకంగా దాదాపు 180 మంది రైతులు పోటీ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. గెలిచేందుకు కాకపోయినా.. ఈ విషయంతోనైనా తమ సమస్యని అందరూ పట్టించుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇలా చేశారు. ఇప్పుడు నిజామాబాద్‌ రైతులు స్ఫూర్తిగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పామూరు మండలం బొట్లగూడూరు గ్రామానికి చెందిన వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్‌ శర్మలు శుక్రవారం వారణాసి లోక్‌ సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. వీరికి మద్దతు తెలిపేందుకు పలువురు స్థానికులు కూడా వారణాసికి వెళ్లారు.

నామినేషన్‌ వేసిన అనంతరం వారణాసిలోని కాలభైరవ ఆలయం వద్ద వెలిగొండ పోరాట సాధన సమితి సభ్యులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కనిగిరి ప్రాంతంలోని ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కలగాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తీరాలన్నారు. ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వారణాసి పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ అనేది ప్రకాశం జిల్లా వాసుల చిరకాలవాంచ అని - ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తే.. జిల్లా వాసులకు తాగునీటి సమస్య తీరుతుందని ఈ సందర్భంగా ప్రకటించారు. మొత్తానికి మోదీతో పోటీకి సై అంటూ ఇద్దరు తెలుగు కుర్రాళ్లు ఒక్కసారి జాతీయమీడియాను ఆకర్షించారు.