Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో కొనసాగుతున్న మృత్యుఘోష 10 మంది మృతి

By:  Tupaki Desk   |   6 Nov 2021 1:32 PM GMT
మహారాష్ట్రలో కొనసాగుతున్న మృత్యుఘోష 10 మంది మృతి
X
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా ఆస్పత్రిలో లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఐసీయూలో భారీగా మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పది మంది కరోనా రోగులు సజీవ దహనమయ్యారు. మరి కొంతమంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో 17 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మంటలు చెలరేగిన క్రమంలో నర్సులు, వార్డు బాయ్స్, వైద్యులు రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. ఐసీయూలో మంటలు చెలరేగిన క్రమంలో ఆస్పత్రి మొత్తం పొగ కమ్మేసింది. తమ వారి పరిస్థితిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. ఐసీయూలో షార్ట్ సర్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్దారించారు. అహ్మద్‌నగర్ ఆస్పత్రి ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతేగాక, ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు సీఎం ఉద్ధవ్.

మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. ఇప్పటి వరకు 10 మంది కరోనా రోగులు మరణించినట్లు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే తెలిపారు. బుల్దానా ఆస్పత్రిలో నవజాత శిశువులు 10 మంది మృత్యువాత పడడం తల్లిదండ్రులకు తీరనిశోకం మిగిల్చింది. ఇటు ముంబైలోని మాల్ ఆస్పత్రిలోనూ మరణాలకు అంతేలేకుండా పోతోంది. మాల్ ఆస్పత్రిలోనూ 10 మంది మరణించగా, నాసిక్ ఆస్పత్రిలో 24 మంది రోగులు తిరిగి రాని లోకాలకు చేరారు. ఇటు విరార్ ఆస్పత్రిలో 13 మంది మరణించారు.