Begin typing your search above and press return to search.

కోనసీమలో కొనసాగుతున్న అరెస్టులు.. తాజాగా మరో 20 మంది అరెస్టు

By:  Tupaki Desk   |   5 Jun 2022 7:11 AM GMT
కోనసీమలో కొనసాగుతున్న అరెస్టులు.. తాజాగా మరో 20 మంది అరెస్టు
X
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురంలో మే 24న జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి పోలీసుల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మొత్తం అరెస్టులు 111కు చేరాయి. వీరంతా దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారేనని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 350కిపైగా సీసీ టీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగులను పోలీసులు నిశితంగా విశ్లేషించారు. మరో 150 మందిని నిందితులను గుర్తించారు. వీరి కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. వీరిని మరికొద్ది రోజుల్లో అరెస్టు చేస్తామని చెబుతున్నారు.

కాగా పోలీసులు దాదాపు 20 వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులను విశ్లేషిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని పోలీస్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, సైబర్‌ క్రైమ్‌ విభాగాలకు చెందిన నిపుణులు ఇదే పనిలో ఉన్నారు. విద్వేషకర పోస్టులు ఎక్కడి నుంచి మొదట వ్యాప్తిలోకి వచ్చాయనే అంశంపై పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా చెప్పుకునే ఓ కీలక నేత పాత్రను పోలీసులు గుర్తించారు. అతడికి కుడి భుజం లాంటి మరో నేతతోపాటు అమలాపురం పట్టణానికి చెందిన కొందరు రౌడీషీటర్లు కూడా దాడులకు పాల్పడ్డట్టు పోలీసులు స్పష్టమైన అంచనాకొచ్చారు.

అమలాపురంలో జరిగిన అల్లర్లలో అధికార వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు మిగిలిన పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నప్పటికీ.. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం వీరికి ఇంకో నగరం నుంచి వచ్చాయని అంటున్నారు. ఈ దిశగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారని సమాచారం. ఇంకో నగరం నుంచి వచ్చిన ఆదేశాలనే నిందితులంతా క్షేత్ర స్థాయిలో అమలు చేశారని గుర్తించారు. ఈ అల్లర్లకు కొందరు ఆర్థిక సహకారం అందించడంతోపాటు ఇతరత్రా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో నిందితులకు ఈ ఆదేశాలు ఇచ్చిన కీలక వ్యక్తులెవరనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

కాగా అమలాపురం పట్టణంలో శుభ కలశం సెంటర్‌ నుంచి మెయిన్‌ రోడ్డు, గడియారం స్తంభం సెంటర్‌, ముమ్మిడివరం గేట్‌ సెంటర్‌, నల్లవంతెన, ఎర్ర వంతెన, రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ నివాసాల వద్ద సీసీ కెమెరాల పుటేజీలను సేకరించినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ జి.పాలరాజు తెలిపారు. అల్లర్లు, విధ్వంసం కేసును మొత్తం 12 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు. మొత్తం 80 మంది పోలీసులు అధికారులు దర్యాప్తులో పాల్గొంటున్నారని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ ఆందోళన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మే 24న అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సమాజంలో కుల చిచ్చును రేపేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడుల్లో పాల్గొన్న అందర్నీ పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసినవారిలో పలువురిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులు నిర్ణయించారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం 52 మందిపై రౌడీషీట్లు ఎత్తేసిన విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిలో కొందరు ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసంలో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. అమలాపురం అల్లర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి అరెస్టుల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత ఈ దాడుల వెనుక కుట్రదారులపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు సూత్రధారులను గుర్తించిన పోలీసులు వారు ఎవరి ప్రోత్సాహంతో, ఏ ప్రయోజనాల కోసం ఈ కుట్ర పన్నారన్న అంశాలపై విచారణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వారి కాల్‌డేటాలు, వాట్సాప్‌ సందేశాలు మొదలైనవి విశ్లేషిస్తున్నారు.

కాగా కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అల్లర్లు, విధ్వంసం చోటు చేసుకున్న అమలాపురంతోసహా జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సున్నితమైనవిగా గుర్తించిన గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గ్రామాల్లోకి అనుమానితుల కదలికలు, రాకపోకలపై పోలీసులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లో అన్నికులాల పెద్దలతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.