Begin typing your search above and press return to search.

అమరావతిలో కాదు ఉత్తరాంధ్రలో పెట్టాలి

By:  Tupaki Desk   |   18 Dec 2020 11:07 AM IST
అమరావతిలో కాదు ఉత్తరాంధ్రలో పెట్టాలి
X
రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్ష అమరావతినే రాజధానిగా ఉంచాలని అంటు చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతి ఉద్యమం మొదలై 365 రోజులైన సందర్భంగా అమరావతి గ్రామాల్లో ఒకటైన రాయపూడిలో గురువారం బహిరంగ సభ జరిగింది. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతినే ఏకైక రాజధానిగా కంటిన్యు చేయాలంటూ డిమాండ్ చేశారు. తన డిమాండే యావత్ ప్రజల డిమాండ్ గా గట్టిగా చెప్పారు.

అంతాబాగానే ఉంది కానీ మొదటినుండి అమరావతికి మద్దతుగా భూములిచ్చిన 29 గ్రామాల్లో కూడా అన్నీ గ్రామాల జనాలు ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటం లేదు. మొత్తంమీద ఏ ఏడో లేకపోతే ఎనిమిది గ్రామాల్లోని జనాలు మాత్రమే ఉద్యమం అంటున్నారు. సరే ఎక్కడ ఉద్యమం అన్నా ఆందోళనన్నా జనాలందరు పాల్గొంటారని అనుకునేందుకు లేదు. కాబట్టి 29 గ్రామాల్లోను ఉద్యమం చాలా బలంగానే ఉందనుకుందాం. మరైతే రాయపూడిలో జరిగిన సభకు వచ్చిన జనాలను టీవీ చానళ్ళల్లో ఎందుకు పెద్దగా చూపలేదు ?

శుక్రవారం ప్రింట్ మీడియాలో బ్యానర్ కథనాలకు మద్దతుగా భారీ ఫొటోలను వేసిన ఇదే మీడియా మరి గురువారం నాడు సభ జరుగుతున్నపుడు లైవ్ ఇచ్చాయి. మరి తమ చానళ్ళల్లో అయినా సభకు హాజరైన జనాలను సరిగా ఎందుకు చూపలేదు ? సరే ఈ విషయాలను వదిలేస్తే అమరావతికి మద్దతుగా అమరావతి గ్రామల్లో కాదు డిమాండ్ రావాల్సింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే డిమాండ్ వినిపించాలన్న చిన్న విషయం చంద్రబాబుకు తెలీదా ?

అమరావతికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం సిటీలో, రాయలసీమలోని ఏదో ఓ జిల్లాలో బహిరంగసభలు పెట్టాలి. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లో ఓచోట, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కడో ఓ సభ నిర్వహిస్తేనే అమరావతి స్పూర్తి ఏమిటో జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. లేకపోతే అమారవతిలో కూర్చుని అమరావతికి యావత్ రాష్ట్రం మద్దతుగా ఉందని చెప్పుకోవటంలో ఉపయోగమే లేదని చంద్రబాబు గ్రహించాలి.

అమరావతికి మద్దతుగా, వ్యతిరేకంగా ఎంఎల్ఏల రాజీనామాలు, రెఫరెండంలన్నీ మనదగ్గర జరిగేపని కాదు. ఇవన్నీ ఒకసారి చెప్పటానికి రాసుకోవటానికి బాగుంటుందంతే. అమరావతి స్పూర్తి రాష్ట్రమంతా ఉందని చంద్రబాబు నిరూపించాలంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ బహిరంగసభలు నిర్వహించి ప్రభుత్వానికి తన సత్తా ఏమిటో చాటాలి. అప్పుడే ప్రభుత్వానికి జనాల ఆకాంక్ష ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది.