Begin typing your search above and press return to search.

ఒకరి ఆవేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదం

By:  Tupaki Desk   |   5 Nov 2019 9:04 AM GMT
ఒకరి ఆవేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదం
X
నాకు దక్కాల్సిన భూమి దక్కలేదనే కోపం, అక్కసు అతడిది. ఏడాదిపాటు తిరిగితిరిగి విసిగి వేసారిపోయాడు. దారుణానికి తెగించాడు. తహసీల్దారు విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు సురేష్. భూమి వివాదాల్లో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నేనేం చేయలేనని ఆమె వాదించింది. అతడి కోపానికి బలై పోయింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ హత్యోదంతంలో బయటికి తెలియని మరో కోణం ఉంది.

ఈ సంఘటనలో ఇరువురిపై రకరకాల సంగతులు వినిపిస్తున్నాయి. విజయారెడ్డి అవినీతికి పాల్పడి అతడి భూమికి పట్టా చేయకుండా తిప్పుకుంటున్నారని ఒకవైపు, కాదు ఆమె నిజాయతీ కలిగిన అధికారి.. సురేష్ అక్రమంగా తన పేరున పట్టా చేయమంటే అది వివాదాల్లో ఉందని ఒప్పుకోలేదని.. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

ఇందులో తప్పు ఎవరిదనే విషయం పక్కన పెడితే.. సురేష్ ఆవేశం తో రెండు కుటుంబాలు వీధిన పడ్డాయి. విజయారెడ్డి ఇద్దరు పిల్లలు జీవితాంతం అమ్మ ప్రేమకు నోచుకోని దుస్థితి ఏర్పడింది. మరోవైపు సురేష్ భార్య, కుటుంబం వీధిన పడ్డారు. ఇప్పుడు ఎలాగూ అతడికి తాను నాది అనుకుంటున్న భూమి దక్కే పరిస్థితి లేదు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఒకవేళ బాగై బయటకు వచ్చ్చినా జైలుకెళ్లక తప్పని పరిస్థితి. అతడే ఆధారం అయిన అతడి కుటుంబం ఆసరా కోల్పోతుంది. తను ఒకరిని చంపితే తన కోపం చల్లారిపోతుందేమోగానీ.. తన సమస్య తీరదు.. పైగా తానే చిక్కుల్లో పడతాను అనే చిన్న విషయం గ్రహించలేకపోయాడు సురేష్. అతడి అనాలోచిత నిర్ణయం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.