Begin typing your search above and press return to search.

జాతీయ జెండానే ఎగురుతుంది - మోడీయే ఎగురవేస్తాడు!

By:  Tupaki Desk   |   5 Aug 2019 7:30 PM IST
జాతీయ జెండానే ఎగురుతుంది - మోడీయే ఎగురవేస్తాడు!
X
భారత భూభాగంలో ఉంటూ... భారత్ సేవలు పొందుతూ - భారత ప్రజల పన్నులతో నిర్వహించ బడుతున్న ఒక ప్రాంతం... మన జాతీయ జెండాలను అవమానిస్తే ఏమీ చేయలేని నిస్సహాయిల్లుగా నిలబడి చూస్తూ ఉండేవాళ్లం. శోచనీయం ఏంటంటే... ఆ హక్కులు వారికి ఇచ్చింది సాక్షాత్తూ భారత ప్రధాని. కాకపోతే అతను కాశ్మీరీ పౌరుడు. నెహ్రూ హయాంలో భారత రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులతో పాటు ప్రత్యేక జెండా ఏర్పాటుకు అనుమతించింది. ఈ ఒప్పందం మధ్య జమ్ముకాశ్మీర్ ప్రధాని షేక్ అబ్ధుల్లా - భారత ప్రధాని నెహ్రూల మధ్య జరిగింది. 1965 వరకు కాశ్మీర్ పాలకుడిని ప్రధాని అని అనే వారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మారింది.

ఇదిలా ఉంటే... అత్యంత కట్టుదిట్టమైన ప్లానింగ్ తో సంపూర్ణ మెజారిటీతో కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరే సంపూర్ణ భారతభూభాగం అయ్యింది. అంటే భారతీయులకు ఇక అన్ని హక్కులు అక్కడ కూడా దఖలు పడతాయి. ఇదే సమయంలో ఇంతకాలం కొనసాగిన కాశ్మీర్ ప్రత్యేక జెండా రద్దయిపోయింది. వచ్చే స్వాతంత్ర వేడుకల్లో ఎప్పటిలా దేశ ప్రధాని ఢిల్లీ నుంచి కాకుండా ఈసారి జమ్ముకాశ్మీర్ లో కేవలం భారత జాతీయ పతాకాన్ని మాత్రమే ఎగుర వేసి కాశ్మీర్ వాసులకు గట్టి సందేశం పంపనున్నారు.

ఇదిలా ఉండగా... అక్కడ ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. హిందువులు - సిక్కులు మైనారిటీలు. చాలాసార్లు అక్కడి యువత కాశ్మీర్ జెండాతో కలిపి ఎగురవేయాల్సిన భారత జాతీయ పతాకాన్ని కాదని... పాకిస్తాన్ జెండాను ఎగురవేస్తూ అదే మా జాతీయ జెండా అనేవారు. భారత పతాకాలను తగులబెట్టేవారు. అయినా... ఆర్టికల్ 370 కారణంగా భారత శిక్షాసృతి దేశద్రోహం నేరం కింద వారిని శిక్షించే అవకాశం కూడా ఉండేది కాదు. బహుశా భారత పతాకానికి జరుగుతున్న అవమానాలనే మోడీని ఎక్కువ ప్రభావితం చేసి ఉండవచ్చు. అందుకే ఆ గడ్డపై వచ్చే ఆగస్టు 15 నాడు కేవలం భారతీయ జెండాను మాత్రమే ఎగురవేసి ఇది భారత దేశం. ఇది భరత భూమి అని చాటి చెప్పడానికి ప్రధాని మోడీ సిద్ధమైనట్టు కనిపిస్తోంది.