Begin typing your search above and press return to search.

వంశీకి మరో సెగ.. వదలని వైసీపీ పగ!

By:  Tupaki Desk   |   21 July 2020 2:00 PM IST
వంశీకి మరో సెగ.. వదలని వైసీపీ పగ!
X
వల్లభనేని వంశీకి ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న విషయం వైసీపీలో చేరాకే అర్థమవుతోందని గన్నవరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరికంటే ముందే చంద్రబాబును ఎదురించి వైసీపీ అధినేత జగన్ జైకొట్టిన వంశీకి లైన్ క్లియర్ చేసింది వైసీపీ అధిష్టానం.. గత ఎన్నికల్లో వంశీ చేతిలో ఓడిన వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీంతో గన్నవరంలో యార్లగడ్ద జెండా పీకేశారు. ఇక వంశీకి అంతా క్లియర్ అయ్యిందని.. భరోసాగా గన్నవరంలో వైసీపీ తరుఫున చక్రం తిప్పవచ్చని భావించాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చిపడింది.

గన్నవరంలో ఒకప్పుడు వెలుగువెలిగి రాజకీయంగా తెరమరుగైన వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దుట్టా అల్లుడు , వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి హైదరాబాద్ నుంచి డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి గన్నవరంకు వచ్చేశారు. వైసీపీ గెలవడంతో పూర్తి స్థాయి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ఇప్పుడు వల్లభనేని వంశీ, శివభరత్ రెడ్డి మధ్య రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.

దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి సీఎం జగన్ కు బంధువునంటూ గన్నవరం నియోజకవర్గంలో వంశీ అంటే పడని వర్గాలను చేరదీస్తూ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. వైసీపీ నిజమైన నాయకులను తనవైపుకు తిప్పుకొని సొంతంగా బలపడుతున్నారట..

తాజాగా వంశీ వర్సెస్ శివభరత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. వైఎస్ జయంతి సందర్భంగా వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించి ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు బాహాబాహీకి గన్నవరంలో దిగడంతో ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో ఈ విభేదాలపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితో దుట్టా వర్గం భేటి అయ్యింది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే తమకే టికెట్ ఇవ్వాలంటూ షరత్ విధించినట్లు సమాచారం. వంశీకి టికెట్ ఇస్తే సహకరించమని.. ఓడిస్తామని తేల్చిచెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే ఈ వార్తలను మాత్రం దుట్టా వర్గం ఖండిస్తోంది.అభివృద్ధి పనుల కోసమే మంత్రి పెద్దిరెడ్డిని కలిసినట్లు చెబుతున్నారు. కానీ వంశీకి పోటీగా దుట్టా వర్గం గట్టిగా గన్నవరంలో హీట్ పెంచుతోంది. వచ్చే ఉప ఎన్నికల్లో వంశీకి అంత ఈజీగా నియోజకవర్గంలో పరిస్థితులు ఉండేలా కనిపించడం లేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.