Begin typing your search above and press return to search.

జనసేన ట్విట్టర్ పార్టీనే.?

By:  Tupaki Desk   |   27 April 2020 12:00 PM IST
జనసేన ట్విట్టర్ పార్టీనే.?
X
ఎన్నో ఆశలు.. ఎన్నో ఊహాలు.. కోట్ల మంది అభిమానుల అండ.. అయితేనేం సార్వత్రిక ఎన్నికల సమరంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఒంటరిగా వెళ్లి ఓడిపోయారు. 2014లో బాబు-మోడీకి మద్దతు పలికి వారి విజయంలో పాలుపంచుకున్నారు. వారి మోసాన్ని గ్రహించి 2019లో ఒంటరిగా పోయి దెబ్బైపోయారు. కనీసం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అన్ని సీట్లు కూడా సాధించలేకపోయారు. స్వయంగా పోటీచేసి మరీ గెలవలేకపోయాడు.

అయితేనేం తాను అధికారం కోసం రాలేదని.. ప్రజలకు సేవ చేయడానికి అని జనసేనాని పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు. తన టార్గెట్ మరో 20 ఏళ్లు రాజకీయం అని ప్రకటించేశారు. కరోనా వేళ 2కోట్లు విరాళం ఇచ్చి తన సేవా హృదయాన్ని చాటుకున్నారు పవన్. ఇక జనసేన నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొంటున్నారు.

ఇంత చేస్తున్నా జనసేన.. ఆ పార్టీ అధినేత ప్రజల్లో గుర్తింపు పొందలేకపోవడానికి ప్రధాన కారణం పార్ట్ టైం పాలిటిక్స్ అనే విమర్శలున్నాయి. పవన్ ఎప్పూడూ జనంలో ఉండరనే అపవాదు ఉంది. అమావాస్య, పౌర్ణమికి వచ్చి హల్ చల్ చేసి మళ్లీ కనిపించకుండా పోతారని జనంలో అభిప్రాయం ఉంది. ఇప్పుడు కరోనా వేళ కూడా ఆయన ప్రజలకు భరోసా ఇవ్వకుండా తెలంగాణలో ఉండిపోయారు.

ఇక తొలిసారి ఒంటరిగా పోటీచేసిన ఓడిపోయాక పవన్ కళ్యాణ్ లోనూ జ్ఞానోదయమైంది. సినిమాలు చేయనన్న ఆయన మళ్లీ ముఖానికి రంగేసుకొని సినిమాలు చేస్తున్నారు.

అయితే రాజకీయం ఎంత వంటబట్టించుకుందామన్న పడటం లేదు పవన్ కు.. జనాలకు ఎంత దగ్గరగా వెళదామన్న వారి ఫాలోయింగ్ పెరగడం లేదు. కానీ సోషల్ మీడియా ఫాలోయింగ్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

కొద్దినెలల్లోనే ట్విట్టర్లో జనసేన పార్టీ ఫాలోయింగ్ బాగా పెరిగింది. తాజాగా జనసేన పార్టీ అఫీషియల్ పేజీ ఒక రికార్డును కైవసం చేసుకుంది. ఏకంగా మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి పార్టీగా రికార్డును అందుకుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 5.6 లక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉండడం గమనార్హం.ఇక మీడియాను, సోషల్ మీడియాను బాగా మేనేజ్ చేసే తెలుగుదేశం పార్టీకి ఫాలోవర్స్ కేవలం 4 లక్షలే కావడం గమనార్హం.

అయితే జనసేనకు ట్విట్టర్ ఫాలోవర్స్ పెరగడం వెనుక యువతే కారణం.. సెల్ ఫోన్లు ఎక్కువగా యువత వద్దే ఉండడం.. వారికే ఎక్కువ ట్విట్టర్ అకౌంట్స్ ఉండడంతో ఆ పార్టీకి ఇది సాధ్యమైంది.

రైతులు, ప్రజలు, సామాన్యులు, పేదలే జనాభాలో అత్యధికులున్నారు. వారు ఎలాగూ తమ పార్టీని ఎంచుకుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వారుండరు. అందుకే ప్రధాన పార్టీలకు అంతగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉండరు. దీన్ని బట్టి జనసేన ప్రజలకు దూరంగా.. యువతకు మాత్రం దగ్గరగా ‘ట్విట్టర్ పార్టీ’గానే పేరొందడం ఖాయంగా కనిపిస్తోంది.