Begin typing your search above and press return to search.

ఒక లాయర్ ను మరో లాయర్ కోర్టులోనే కాల్చి చంపేశాడు

By:  Tupaki Desk   |   19 Oct 2021 9:35 AM IST
ఒక లాయర్ ను మరో లాయర్ కోర్టులోనే కాల్చి చంపేశాడు
X
న్యాయం జరుగుతుందని ఆశ పడే న్యాయస్థానాలు పగలు.. ప్రతీకారాలు తీర్చుకోవటానికి వేదికలుగా మారుతున్నాయా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఉదంతమే దీనికి నిదర్శనం. కోర్టులో ఒక లాయర్ మరో లాయర్ ను కాల్చి చంపేసిన వైనం సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్ స్టర్ల మధ్య కాల్పులు జరగటం.. ఈ ఉదంతంలో ముగ్గురు మరణించటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటం తెలిసిందే.

కోర్టుల వద్ద భద్రతపై ఆందోళన వ్యక్తం కావటం తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. యూపీలో అనూహ్య పరిణామానికి కోర్టు వేదికగా మారింది. యూపీలోని షాజహాన్ పూర్ జిల్లా కోర్టులో ఒక లాయర్ ను మరో లాయర్ పిస్టల్ తో కాల్చి చంపేశాడు. లాయర్ భూపేంద్రసింగ్ సోమవారం ఒక కేసుకు సంబంధించిన షాజహాన్ పుర్ లోని జిల్లా కోర్టులో మూడో అంతస్తులో ఉన్న క్లర్క్ ను కలిసేందుక వెళ్లారు.

అదే సమయంలో పిస్టల్ కాల్పులు వినిపించటంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఆందోళనకు గురయ్యారు తీరా చూస్తే.. 38 ఏళ్ల లాయర్ భూపేంద్ర సింగ్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని వద్ద ఒక లైసెన్సు లేని రివాల్వర్ పడి ఉంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు. .ఈ కాల్పులకు కారణమైంది కూడా ఒక లాయరే అన్న విషయాన్ని గుర్తించారు. గంటల వ్యవధిలోనే సదరు న్యాయవాదిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను చేసిన నేరాల్ని ఒప్పుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న పాత గొడవల కారణంగానే తాను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతం కోర్టుల భద్రతను క్వశ్చన్ చేసేలా మారిందనటంలో సందేహం లేదు.