Begin typing your search above and press return to search.

ఫిన్‌ లాండ్ ఒక్క రోజు ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయి !

By:  Tupaki Desk   |   8 Oct 2020 3:38 PM IST
ఫిన్‌ లాండ్ ఒక్క రోజు ప్రధానిగా 16 ఏళ్ల అమ్మాయి !
X
ఒక్కరోజు ముఖ్యమంత్రి అనగానే అందరికి శంకర్ , అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమానే గుర్తుకు వస్తుంది. ఆ సినిమా సీఎం నువ్వు ఒక్కరోజు నా సీటులో ఉండి చూడు అని అర్జున్ కి సవాల్ విసిరితే , దాన్ని స్వీకరించి ఒక్క రోజు సీఎంగా అద్భుతాన్ని చేసి చూపిస్తాడు. ఐతే , అది సినిమా కాబట్టి ఎన్ని అద్భుతాలు అయినా కూడా చూపించవచ్చు. నిజ జీవితంలో ఇలా జరుగుతుందా !అంటే జరిగింది అనే చెప్పాలి , ఒక్కరోజు ముఖ్యమంత్రికాదు ఏకంగా ఒక్కరోజు ప్రధానమంత్రిగా భాద్యతలు స్వీకరించింది 16 ఏళ్ల బాలిక.

అసలు అదేంటి సినిమాలో అయితే సాధ్యం అయింది , బయట కూడా అది సాధ్యమేనా అంటే ఫిన్ ‌లాండ్ ప్రధాని మాత్రం సాధ్యమే అని చెప్పారు. స్త్రీ, పురుష సమానవత్వంలో ఫిన్‌ లాండ్ తరచూ అగ్రస్థానంలో ఉంటుంది. ఆ దేశ ప్రధానమంత్రి సనా మారిన్ దేశంలో లింగ వివక్షపై తమ పోరాటాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఓ పదహారేళ్ల బాలిక ఒక రోజు ప్రధానమంత్రిగా ఉండేందుకు ఆమె తన పదవిని ఆ బాలికకు అందించారు. బుధవారం ఫిన్‌ లాండ్ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న అవా ముర్టో కొత్త చట్టాలేమీ చేయలేదు. కానీ, టెక్నాలజీలో మహిళల హక్కులను హైలైట్ చేయడానికి ఆమె రోజంతా రాజకీయ నాయకులతో సమావేశం అయ్యారు.

ఐక్యరాజ్యసమితి బాలికల దినోత్సవం సందర్భంగా, పిల్లల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ తన ప్రచారంలో భాగంగా ముర్టోకు ఈ అవకాశం అందించింది.ప్లాన్ ఇంటర్నేషనల్ 'గర్ల్స్ టేకోవర్' లో భాగంగా ఫిన్‌లాండ్ ఇలా చేయడం ఇది నాలుగోసారి. గర్ల్స్ టేకోవర్‌ లో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలు రాజకీయాలు, వివిధ రంగాల నాయకుల స్థానంలో బాలికలు ఒక రోజు ఉండడానికి అనుమతిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది బాలికలకు డిజిటల్ నైపుణ్యాలు, సాంకేతిక అవకాశాలను ప్రోత్సహించాలనే ప్రచారంపై దృష్టి పెట్టారు. ఫిన్ ‌లాండ్ ‌తో పాటు కెన్యా, పెరూ, సూడాన్, వియత్నాం కూడా ఇలా బాలికల కోసం ఒక రోజు మార్పులు చేస్తున్నాయి.