Begin typing your search above and press return to search.

అగ్నిదేవుడ్ని అర్జెంట్ గా ప్రసన్నం చేసుకోండి జగన్

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:32 PM GMT
అగ్నిదేవుడ్ని అర్జెంట్ గా ప్రసన్నం చేసుకోండి జగన్
X
దేశంలోని మరే రాష్ట్రంలో చోటు చేసుకోని ఉదంతాలు ఏపీలో జరుగుతున్నాయి. ఒకేలాంటి ప్రమాదాలు.. వరుస పెట్టి పలు చోట్ల చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం. బెజవాడ నడిబొడ్డున ఉన్న స్వర్ణప్యాలెస్ లోని రమేశ్ ఆసుపత్రి వారు నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం.. పది మంది చనిపోవటం.. ఇరవై మందికి గాయాలు కావటం చాలా పాత విషయం. ఈ ఉదంతాన్ని జగన్ సర్కారు ఎంత సీరియస్ గా తీసుకుందన్న విషయం పాతదే. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వ అధికారులు పరుగులు తీస్తున్నారు. వారి తీరుతో భయపడిపోయిన రమేశ్ ఆసుపత్రి ఎండీ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోవటం.. అదేమీ కాదు చంద్రబాబు ఇంట్లోనే ఆయన్ను దాచి ఉంచారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో ఒకరిద్దరు ఆరోపిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మంగళవారం ఏపీకి ఒక కొసన ఉన్న వైజాగ్ ఆసుపత్రిలో.. బుధవారం ఏపీకి మరో కొసకు ఉన్న అనంతపురంలోని ఆసుపత్రిలో ఆగ్నిప్రమాదం చోటు చేసుకోవటం ఇప్పుడు పరేషాన్ గా మారింది. అంతో ఇంతో ఊరటనిచ్చే అంశం ఏమైనా ఉందంటే.. ఈ రెండు ఆగ్నిప్రమాదాల్లో ఎవరికి ఏమీ కాకపోవటం. ఈ మూడు ఉదంతాలు చూసినంతనే.. ఏపీకి ఏమైంది? అగ్నిదేవుడికి ఏమైనా కోపం వచ్చిందా? అన్న సందేహం సామాన్యులకు కలుగక మానదు.

మరో కీలకమైన అంశం ఏమంటే.. స్వర్ణ ప్యాలెస్ ఉదంతాన్ని జగన్ ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుందో.. అంతేలా మిగిలిన రెండు ప్రమాదాల విషయంలోనూ అలానే వ్యవహరిస్తుందా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ప్రాణాలు పోవటం మినహాయిస్తే.. ఈ మూడు అంశాలు ఒకేలాంటివన్నది మర్చిపోకూడదు. ఇంతకీ దేశంలో మరే రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చోటు చేసుకోని అగ్నిప్రమాదాలు.. ఏపీలోనే ఎందుకు జరుగుతున్నాయి? అన్నది మరో సందేహం. దేవుడ్ని నమ్మినా.. నమ్మకున్నా.. కాస్తంత ఆగ్నిదేవుడి కోపాన్ని తగ్గించేలా ఏదైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందేమో? ఇలాంటి విషయాల్లో మాంచి అనుభవం ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా తీసుకునే విషయాన్ని ఏపీ సీఎం జగన్ ఆలోచించొచ్చు కదా?