Begin typing your search above and press return to search.

300మంది హాజరైన పెళ్లిలో 9 మందికి ఒమిక్రాన్ వైరస్!

By:  Tupaki Desk   |   7 Dec 2021 11:39 AM GMT
300మంది హాజరైన పెళ్లిలో 9 మందికి ఒమిక్రాన్ వైరస్!
X
ఒమిక్రాన్.. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ కేసులో ఇప్పుడు దేశంలోనూ చాపకింద నీరులా పెరుగుతూ భయాందోళన కలిగిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక్క కేసు కూడా లేదు.

కానీ ఇప్పుడు ఏకంగా సోమవారానికి 50కిపైగా కేసులు వెలుగుచూడడం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం మహారాష్ట్రలోనే కొత్తగా ఏడు కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో 9 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

ఒమిక్రాన్ కొత్త కరోనా వేరియంట్ ఇప్పుడు ప్రపంచానికి మరోసారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతానికైతే మన దేశంలో ఈ వేరియంట్ కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో రోజుకు లక్ష కేసులు నమోదవుతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఒమిక్రాన్ తీవ్రత చూస్తుంటే దేశంలో థర్డ్ వేవ్ తప్పదని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన ఓ విషయం తెలిసింది. రాజస్థాన్ లోని జైపూర్ లో ఒకే కుటుంబంలోని 9 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

వీళ్లంతా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ నుంచి భారత్ కు వచ్చినట్లు తెలిసింది. జైపూర్ లోని సిటీ ప్యాలెస్ లో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నవంబర్ 28న ఈ కుటుంబం భారత్ కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

ఢిల్లీ వధువుకు, అజిత్ నగర్ కు చెందిన వరుడికి జైపూర్ లోని సిటీ ప్యాలెస్ లో నవంబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఒమిక్రాన్ సోకిన 9మంది గల కుటుంబం హాజరైంది. అప్పటికీ వీరికి వైరస్ సోకినట్లు తెలియదు.

దాదాపు 300కి పైగా ఈ పెళ్లికి హాజరైనట్లు తెలిసింది. ఆ 300 మందిని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. వీరు ఇంకెంత మందికి ఈ వైరస్ అంటించారనే టెన్షన్ ఇప్పుడు అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.

పెళ్లికి హాజరైన వారందరినీ గుర్తించి వారి నుంచి శాంపిల్స్ సేకరించే పనిలో వైద్యాధికారులు పడ్డారు. మరోపక్క ఈ పెళ్లి జరిగిన సిటీ ప్యాలెస్ కు వెళ్లి ఓ మెడికల్ టీం ఆరాతీస్తోంది. ప్యాలెస్ లోని పనివారికి టెస్టులు చేస్తోంది.

ఒమిక్రాన్ సోకిన ఆ కుటుంబంలో 9 మంది ఉండగా.. వారిలో ముగ్గురు చిన్నారులు ఉండడం గమనార్హం. మిగిలిన ఆరుగురు ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. చిన్నారుల కు వ్యాక్సిన్ లేకపోవడంతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స నడుస్తోంది.