Begin typing your search above and press return to search.

దేశంలో జెట్ స్పీడుగా పాజిటివిటీ రేటు

By:  Tupaki Desk   |   25 Jan 2022 1:42 PM GMT
దేశంలో జెట్ స్పీడుగా పాజిటివిటీ రేటు
X
దేశంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం రోజున ఇది 17.78 శాతం ఉండగా.. సోమవారానికల్లా 20.75 శాతానికి పెరిగింది. కోవిడ్ పరీక్ష చేయించుకున్న ప్రతి 100 మందిలో ఎంతమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతుందో తెలిపే సూచిక ‘పాజిటివిటీ రేటు’. ఇది దేశంలోని 207 జిల్లాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.

తిరువనంతపురం (కేరళ), ఫరీదాబాద్(హర్యానా), ఉత్తర గోవా జిల్లాల్లో పాజిటివిటీ రేటు సగటున 46 శాతం మేర ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ లెక్కన అక్కడ కోవిడ్ పరీక్ష చేయించుకుంటున్న ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.

రోహ్ తక్ (హర్యానా), ఫుణే (మహారాష్ట్ర), మొహాలీ(పంజాబ్) జిల్లాల్లోనూ పాజిటివిటీ 40 శాతానికిపైనే ఉండగా.. దక్షిణ గోవా జిల్లాలో ఇది 39 శాతానికి చేరువలో ఉంది.

మరోవైపు వరుసగా నాలుగోరోజూ దేశంలో కరోనా కేసులు తగ్గాయి. సోమవారం నాటికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.06 లక్షల మందికి కోవిడ్పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. క్రియాశీల కేసుల సంఖ్య మాత్రం మరో 62130 పెరిగింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల (2021 మే నాటి) గరిష్టానికి పెరిగి 22.49 లక్షలకు చేరింది. కరోనాతో 439 మృతిచెందారు. ఎన్.సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (81)కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంోించారు. దీనిపై పవార్ ట్విటర్ లో కృతజ్ఞతలు తెలిపారు.

రెండోసారి కోవిడ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సోమవారం ఫోన్ చేసి ఆరోగ్య సమాచారం తెలుసుకున్న ప్రముఖుల్లో ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా తదితరులు ఉన్నారు.

ఇక దేశంలో కరోనా కేసులు ఫిబ్రవరి 15 కల్లా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి. ముంబై , ఢిల్లీ , కోల్ కతా, చెన్నైలలో కేసులు తగ్గుతుండడాన్ని అందుకు ఒక సంకేతంగా భావించవచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే నాలుగు నగరాల్లో కోవిడ్ కేసులు పతాక స్థాయికి చేరాయని.. కేసులు తగ్గడం కూడా కొన్ని రోజుల క్రితమే మొదలైందని గుర్తు చేస్తున్నారు. క్రితం రోజుతో పోలిస్తే సోమవారం కొత్త కొవిడ్ కేసులు ఢిల్లీలో తగ్గాయి.

వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండడం.. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరుగుతుండడం.. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాలు మినహా మిగతా చోట్ల కరోనా వ్యాప్తి తక్కువగా ఉండటం వంటి కారణాలు సానుకూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఆగ్నేయాసియా దేశాలతో పోల్చితే భారత్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు తేలింది. వారం రోజుల వ్యవధిలో భారత్ లో కరోనా కేసుల సంఖ్య 150 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. జనవరి 10-16తో ముగిసిన వారంలో భారత్ లో 6.38 లక్షల కొత్త కేసులే నమోదవగా.. జనవరి 17-23 మధ్యలో కొత్తగా 15.94 లక్షల మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని గుర్తు చేసింది.