Begin typing your search above and press return to search.

ఒమిక్రాన్ వారి పైనే ఎక్కువ ప్రభావం!

By:  Tupaki Desk   |   14 Dec 2021 6:43 AM GMT
ఒమిక్రాన్ వారి పైనే ఎక్కువ ప్రభావం!
X
దక్షిణాఫ్రికాలో పుట్టిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ ఘోరకలిని సృష్టించింది. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వేరియంట్ అంతకు మించి ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరమని అంచనా వేస్తున్నారు.

సామాజిక పరివర్తన చెందుతూ ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్తున్నారు. దీంతో చాలా దేశాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఇప్పటికే కరోనాకు సంబంధించిన సెకండ్ వేవ్ ను చూసి చాలా దేశాలు ఈ వేరియంట్ ప్రబలితే మాత్రం అనుకోను గడ్డు రోజులు చూడాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ వేరియంట్ ఎక్కువగా ఎవరి మీద ప్రభావం చూపిస్తుందనే దానిపై కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే చాలా సంస్థలు కీలక పరిశోధనలు చేపట్టాయి. అయితే వీటిలో తేలింది ఏమిటంటే..? ఊబకాయం ఎక్కువగా ఉన్న వారిపై ఈ వేరియంట్ తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. బాడీ మాస్ ఇండెక్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్న వారిపై ఈ కొత్త వేరియంట్ ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా వారు లావు ఉండటం కారణంగా వీరిపై ఒమిక్రాన్ విరుచుకు పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.. ఇది ఒమిక్రాన్ మరింత కుంగ తీసేందుకు సహాయం చేస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే స్థూలకాయుల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. వీరిలో కూడా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సర్వేలో తేలినట్లు పేర్కొన్నారు. ఇందుకు గాను సుమారు 400 మంది పిల్లలపై శాస్త్రవేత్తలు ఈ సర్వేను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన సర్వే ఫలితాలు ప్లోస్ ఒన్ అనే జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. ఈ సర్వే కీలకంగా కెనడా, కోస్టారికా, ఇరాన్ లాంటి దేశాల్లో జరిగినట్లు సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా సోమవారం తొలి మరణం నమోదు అయ్యింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్నీ దేశాల్లో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. వ్యాక్సినేషన్ ను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో పాటు ఒమిక్రాన్ ను తక్కువ అంచనా వేయకూడదని స్పష్టం చేసింది.