Begin typing your search above and press return to search.

రాబోయే రోజుల్లో అమెరికాలో రోజుకు 5 లక్షల కేసులు..!

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:32 AM GMT
రాబోయే రోజుల్లో అమెరికాలో  రోజుకు 5 లక్షల కేసులు..!
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు ఈ వైరస్ కు సంబంధించిన కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ వైరస్ తాలూకు కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. తాజాగా అమెరికా లో సుమారు రెండు లక్షల కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే వారం రోజుల్లో రాబోతున్న జనవరి 1 నాటికి ఈ కేసుల సంఖ్య అమాంతం పెరిగే సూచనలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గడిచిన క్రిస్టమస్ పండగ తో వైరస్ వ్యాప్తి మరింత పెరిగిందని నిపుణులు అంచనా వేశారు. ఈ క్రమంలోనే వచ్చే కొద్ది రోజుల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు.

నిపుణుల అంచనాల ప్రకారం మరికొద్ది రోజుల్లో రోజుకు ఐదు లక్షల వరకు కరోనా కేసులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వైరస్ కేసులు నమోదు గ్రాఫ్ పైపైకి పెరుగుతోందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా పండగలను సూచిస్తున్నారు. పండుగ సమయంలో పెద్ద మొత్తంలో ప్రజలు ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడం తో పాటు ఇతరులను కలిసే క్రమంలో వైరస్ వ్యాప్తి మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఈ కారణంగా కొత్త కేసులు భారీగా నమోదు అవుతున్నట్లు తెలిపారు.

అమెరికాలో ఈ ఆదివారం సుమారు ఒక లక్షా తొంభై ఎనిమిది వేల కేసులు నమోదయ్యాయి. ఇలా ఈ స్థాయిలో కేసులు ఈ ఏడాది జనవరిలో మాత్రమే వెలుగు చూశాయి. ప్రస్తుతం నమోదయ్యే కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇలానే కేసులు నమోదు కొనసాగితే ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతుందని తెలిపారు. సరిగ్గా వారం క్రితం నమోదైన కేసుల సంఖ్య తో పోలిస్తే ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య సుమారు 47 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రముఖ అమెరికా వైద్యుడు డాక్టర్. జోనాథన్ రీనర్ ప్రకారం చూస్తే... వైరస్ కేసుల సంఖ్య గతంతో పోలిస్తే రెండింతలు కంటే ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. ఒక రోజుల్లోనే సుమారు 5 లక్షలకు పైగా కేసులు నమోదు అవుతాయని పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజే 71 వేల మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు.

డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ... అమెరికా లో ఖచ్చితంగా కొత్త వేరియంట్ తో కేసుల పెరుగుదల భారీగా ఉండనున్నట్లు పేర్కొన్నారు. అందుకనే అందరూ పూర్తి స్థాయిలో టీకాలను రక్షించు. పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తుల సురక్షితంగా ఉంటారని ఆయన చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని న్యూయార్క్ నగరంలో ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం తప్పనిసరి చేశారు.