Begin typing your search above and press return to search.

రాజీనామాకు ఓకే.. పెళ్లి చేసుకోమన్నారు

By:  Tupaki Desk   |   5 Nov 2019 5:24 AM GMT
రాజీనామాకు ఓకే.. పెళ్లి చేసుకోమన్నారు
X
సర్కారీ కొలువు రావటం ఇవాల్టి రోజుల్లో చాలా కష్టం. అందునా పోలీసు శాఖలో అంటే అందుకు పోటీ భారీగా ఉంటుంది. అంతా అనుకున్నట్లు జరిగి.. ఉద్యోగంలో చేరినోళ్లను చూసి అసూయ చెందేటోళ్లు చాలామందే ఉంటారు. వేలల్లో పోటీ నుంచి ఫిల్టర్ చేస్తే కానీ ఫైనల్ గా ఉద్యోగం దక్కదు. అలాంటిది బంగారం లాంటి జాబ్ ను తింగరి మాటలతో చేజార్చుకునేటోళ్లు ఉంటారా? అంటే నో చెబుతారు. కానీ.. ఆ మధ్యన సంచలన వ్యాఖ్యలు చేసి జాబ్ రిజైన్ చేసేస్తూ.. లెటర్ పంపిన కానిస్టేబుల్ ఉదంతం గుర్తుందా?

ఉద్యోగంలో చేరిన నాలుగు సంవత్సరాల తర్వాత.. పెళ్లి సంబంధానికి వెళితే.. పెళ్లి కుమార్తె పోలీసోడికి పిల్లనివ్వమంటూ చెబుతున్నారని.. తాను చేస్తున్న ఉద్యోగంపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాజీనామా చేస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాసిన పోలీస్ కానిస్టేబుల్ ఎపిసోడ్ లో తాజాగా ఒక పరిణామం చోటు చేసుకుంది.

చార్మినార్ పోలీస్ స్టేషన్ లో నాలుగేళ్లుగా కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు సిద్దాంతి ప్రతాప్. ఇటీవల ఒక పెళ్లి సంబంధానికి వెళ్లగా.. కానిస్టేబులే కదా.. ఇరవైనాలుగు గంటలూ పని ఉంటుందంటూ పెళ్లి కుమార్తె రిజెక్ట్ చేసింది. బీటెక్ చదివి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న ప్రతాప్ ఫస్ట్రేషన్ కు గురయ్యాడు. ఇంజినీరింగ్ చేసినా పోలీసు శాఖపై తనకున్న ఇష్టంతోనే ఉద్యోగంలో చేరినట్లుగా చెబుతూ.. తనకు పెళ్లికి అడ్డుగా మారిన ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

ఈ వ్యవహారం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారటమే కాదు.. ఇదో చర్చనీయాంశంగా మారింది. తన రాజీనామా లేఖను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు పంపారు. అప్పట్లో పోలీసు అధికారులు కౌన్సింగ్ నిర్వహించారు. ప్రతాప్ పేర్కోన్న పెళ్లి ఇష్యూ హైలెట్ అయినప్పటికీ.. అతను తెర మీదకు తీసుకొచ్చిన మరో అంశం మాత్రం పెద్దగా ఫోకస్ కాలేదు.

అదేమంటే.. కానిస్టేబుల్ గా చేరిన వారికి పదోన్నతులు పెద్దగా ఉండవని.. సర్వీసు మొత్తం కష్టపడితే హెడ్ కానిస్టేబుల్.. ఏఎస్ ఐ వరకూ మాత్రమే పదోన్నతి లభిస్తుందన్న విషయం మీద మాత్రం చర్చ జరగలేదు. నిజానికి కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న కష్టం.. కెరీర్ పరంగా ఉన్న లోపాన్ని ఎత్తి చూపిన ప్రతాప్ వాదన పక్కదారి పట్టి పెళ్లి మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. తాజాగా ప్రతాప్ రాజీనామాకు ఓకే చెప్పిన పోలీసు శాఖ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతాప్ ఏమనుకుంటున్నాడన్నది ఇప్పుడు బయటకు రాని పరిస్థితి.