Begin typing your search above and press return to search.

హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడా రెడ్ జోన్ లేదు

By:  Tupaki Desk   |   28 March 2020 2:37 PM GMT
హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడా రెడ్ జోన్ లేదు
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల రెడ్ జోన్లు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై అధికారులు స్పందించారు. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కడా రెడ్ జోన్ లేదని - అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని - ఇవి నిరాధారమైనవని - అలాంటి వదంతులు నమ్మవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే, ఇలాంటి అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యంత్రాంగం హెచ్చరించింది.

కోకాపేట్ - చందానగర్ - తుర్కయాంజల్ - కొత్తపేట్ తదితర ప్రాంతాలను రెడ్ జోన్‌ గా ప్రకటించారని శుక్రవారం నుండి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం సాగుతోందని జీహెచ్ ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ చెప్పారు. కానీ జీహెచ్ ఎంసీ పరిధిలో అలాంటి రెడ్ జోన్స్ లేవన్నారు. ప్రజలు కూడా ఇలాంటి అవాస్తవ ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. రెడ్ జోన్ ఉన్నట్లు మార్ఫింగ్ చేసి మరీ పెడుతున్నారన్నారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కేసులు పెడతామన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ - హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కూడా రెడ్ జోన్ వార్తలను కొట్టి పారేశారు. ఈ జిల్లాల్లో ఎలాంటి రెడ్ జోన్ లేదని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెడతామని - కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ప్రామాణిక సమాచార వనరుల పైనే ఆధారపడాలన్నారు.

మరోవైపు - లాక్ డౌన్ నేపథ్యంలో నగరంలో నిత్యావసరాలు - పాలు - ఆహార ఉత్పత్తుల కొరత ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ... నిత్యావసరాల కొరత లేదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రిటైల్ అవుట్ లెట్లు - కిరాణా దుకాణాల్లో సామాగ్రి అందుబాటులో ఉందని - భయపడాల్సిన అవసరం లేదన్నారు.