Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లంటే మీకంత ఎట‌కార‌మేంది విష్ణురాజు?

By:  Tupaki Desk   |   1 Aug 2018 2:28 PM GMT
ఆంధ్రోళ్లంటే మీకంత ఎట‌కార‌మేంది విష్ణురాజు?
X
ఆంధ్రోళ్లంటే అంద‌రికి ఎట‌కార‌మే. కేంద్రంలోని మోడీ స‌ర్కారు మొద‌లుకొని రాష్ట్రంలో బాబు స‌ర్కారు వ‌ర‌కూ అంద‌రూ ఏపీ ప్ర‌జ‌ల్ని ఆటాడుకునే వారే. ఎవ‌రేం చేసినా గుంభ‌నంగా ఉండ‌టం.. ఓట్ల వేళ్ల ఒళ్లు చీరేసేలా తీర్పు ఇవ్వ‌ట‌మే త‌ప్పించి.. రోడ్ల మీద‌కు రావ‌టం.. విరుచుకుప‌డ‌టం పెద్ద‌గా ఉండ‌దు.

క‌డ‌పులోని క‌సంతా బ్యాంకులో డ‌బ్బులు డిపాజిట్టు చేసిన చందంగా అంత‌కంత‌కూ పెంచుకుంటూ.. ఎప్పుడైతే త‌మ టైం వ‌స్తుందో అప్పుడు తామేం చేయాలో చేసే ఏపీ ప్ర‌జ‌ల‌కు త‌గ్గ‌ట్లే.. ఏపీ నేత‌లు సైతం వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అప్పుడెప్పుడో ఎన్నిక‌లప్పుడు క‌దా? అప్ప‌టివ‌ర‌కూ తామేం చేసినా.. మాట్లాడినా ఏం చేయ‌ర‌న్న ధీమానో ఏమో కానీ.. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

మొన్న‌టికి మొన్న అవిశ్వాస తీర్మానం చ‌ర్చ సంద‌ర్భంగా విశాఖ రైల్వే జోన్ విష‌యంపై పాజిటివ్ గా రియాక్ట్ కావ‌టం తెలిసిందే. హోదాకు హ్యాండిచ్చినా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ విశాఖ రైల్వే జోన్ ను ప్ర‌క‌టించ‌టం ద్వారా.. ఎన్నిక‌ల్లో అంతో ఇంతో మైలేజీ వ్యూహాన్ని సిద్ధం చేసింద‌న్న మాట వినిపించింది. అయితే.. అదంతా త‌ప్ప‌న్న విష‌యం సుప్రీంకోర్టులో కేంద్రం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ రూపంలో చెప్పేసింది.

విశాఖ జోన్ సాధ్యం కాద‌ని.. క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ మీద ఆశ‌లు వ‌దులుకోవాల‌న్న విష‌యాన్ని చెప్పేసింది. దీనిపై స‌హ‌జంగానే ఆంధ్రోళ్లు మ‌రింత ర‌గిలిపోయారు. ఈ మ‌ధ్య వ‌ర‌కూ అంతో ఇంతో ఆశ‌లు కూడా సుప్రీంలో మోడీ స‌ర్కారు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో మొండి చేయి త‌ప్పించి ఇంకేమీ ఇవ్వ‌ర‌ని తేలిపోయింది.

ఇదిలా ఉంటే.. కేంద్రం తీరుకు భిన్నంగా మాట్లాడ‌టం మొద‌లు పెట్టారు ఏపీ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత క‌మ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఊఊతాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌కు రైల్వే జోన్.. క‌డ‌ప‌కు ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏపీకి కేటాయించేందుకు మోడీ స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో విశాఖ రైల్వే జోన్ ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెప్పారు.

ఓవైపు విభ‌జ‌న హామీల‌పై సుప్రీంలో కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్లో ఒక‌లాంటి వాద‌న‌ను వినిపిస్తూనే.. మ‌రోవైపు అందుకు భిన్నంగా రైల్వే జోన్ వ‌చ్చేస్తోంది... క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ కూడా సానుకూల నిర్ణ‌యాన్ని తీసుకోనున్న‌ట్లుగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ చెబుతున్న అంశాలు చూస్తే.. ఆయ‌న ఢిల్లీ పార్టీ పెద్ద‌ల‌తో మాట్లాడే ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నారా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. విశాఖ రైల్వే జోన్.. క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ కోసం ధ‌ర్నాలు.. నిరాహార దీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న రాజు.. ధ‌ర్నాలు చేయాల‌నుకుంటే ఏపీలో జ‌రిగే అవినీతి.. ఇసుక మాఫియా.. లంచ‌గొండిత‌నం మీద చేయాల‌ని పేర్కొనటం గ‌మ‌నార్హం. విభ‌జ‌న హామీల అమ‌లుపై ఇప్ప‌టికే ఆంధ్రోళ్ల‌ను ఒక ఆట ఆడుకుంటున్న బీజేపీ నేత‌లు.. మ‌రింతగా ఆడుకోవాల‌ని భావిస్తున్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. బీజేపీ స‌ర్కారేమో సాధ్యం కావ‌న్న విష‌యాల్ని విష్ణుకుమార్‌రాజు మాత్రం అందుకు భిన్నంగా చేసేస్తున్నామంటూ గొప్ప‌గా చెప్పుకోవ‌టం దేనికి నిద‌ర్శ‌నం?