Begin typing your search above and press return to search.

మిత్రుడి మ‌న‌సు దోచేసిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   28 July 2019 8:13 AM GMT
మిత్రుడి మ‌న‌సు దోచేసిన కేసీఆర్‌!
X
గొప్ప‌లు చెప్పుకోవ‌టంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తీరు విభిన్నంగా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఆయ‌న చెప్పుకునే గొప్ప‌లు విన్నోళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. క‌ళ్ల ముందు 70ఎంఎం సినిమా చూపించే కేసీఆర్ మాట‌ల్ని చాలామంది తీసి పారేస్తుంటారు. ఇటీవ‌ల కాలంలో తెలంగాణ‌లో ప‌డ‌కేసిన పాల‌న‌తో ఆయ‌న మీద ఉన్న న‌మ్మ‌కం అంత‌కంత‌కూ త‌గ్గుముఖం ప‌డుతున్న ప‌రిస్థితి.

పాల‌నా ప‌రంగా సెక్ర‌టేరియ‌ట్ కు రాకుండా పాల‌న చేసే ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకున్న సారులో మ‌రో మంచి ల‌క్ష‌ణం ఏమంటే.. తాను చేసిన సాయాన్ని గొప్ప‌గా చెప్పుకోరు. ఉత్త‌రాంధ్ర‌ను ఊపేసి.. విశాఖ‌ను దారుణంగా డ్యామేజ్ చేసిన హూదూద్ తుపాను స‌మ‌యంలో ఉక్కున‌గ‌రానికి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు.

వేలాది విద్యుత్ స్తంభాలు.. తీగ‌లు దారుణంగా దెబ్బ తిన్న వైనం తెలిసిందే. ఇలాంటిప‌రిస్థితుల్లో విశాఖ న‌గ‌రానికి వారం.. ప‌ది రోజుల పాటు విద్యుత్ ఉండ‌ద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. ఆ స‌మ‌యంలో దేవుడు మాదిరి కేసీఆర్ రియాక్ట్ అయిన తీరు.. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ సిబ్బందిని.. ప‌రిక‌రాల్ని తీసుకొని ఏపీకి వెళ్లి.. అక్క‌డి ప‌రిస్థితిని యుద్ధ ప్రాతిప‌దిక‌న కంట్రోల్ లోకి తెచ్చారు. విభ‌జ‌న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారానికి మీడియా పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌టంతో కేసీఆర్ కు ఆ ఎపిసోడ్ లో మైలేజీ ల‌భించ‌లేదు.

తాజాగా ఒడిశా మీద విరుచుకుప‌డిన ఫోని తుఫాను కార‌ణంగా దారుణంగా ఎఫెక్ట్ అయింది. ఈ సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మిత్రుడికి సాయం చేసేందుకు తెలంగాణ నిపుణుల బృందాన్ని పంపించ‌టం.. సాయం చేయ‌టం.. విద్యుత్ పున‌రుద్ద‌ర‌ణ‌లో కీల‌క సాయం చేశారు. తెలంగాణ నిపుణుల బృందం చేసిన సాయంపై ఒడిశా రాష్ట్ర ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఒక లేఖ రాశారు.

తుపాను సంద‌ర్భంగా విద్యుత్ వ్య‌వ‌స్థ దెబ్బ తింటే పున‌రుద్ద‌ర‌ణ‌కు తెలంగాణ నిపుణుల బృందాన్ని పంపించి స‌హ‌క‌రించారంటూ తాజాగా ఒక‌లేఖ రాశారు న‌వీన్ ప‌ట్నాయ‌క్. చేసిన ప‌నిని ప‌ది సార్లుచెప్పుకునే ఈ రోజుల్లో అందుకు భిన్నంగా చేసిన సాయం గురించి ప్ర‌చారం చేసుకోని కేసీఆర్ తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఏమైనా.. సారులో మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా.. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునేందుకు స‌రిహ‌ద్దుల్ని చెరిపేసుకొని మ‌రీ వెళ్లి సాయం చేయించే తీరును అభినందించాల్సిందే.