Begin typing your search above and press return to search.

అయ్యన్నకు అసలైన అడ్డంకి ఆయనే... ?

By:  Tupaki Desk   |   11 Dec 2021 3:56 AM GMT
అయ్యన్నకు అసలైన  అడ్డంకి ఆయనే... ?
X
విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన రాజకీయ జీవితం అచ్చంగా నాలుగు దశాబ్దాలు, అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డారు. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ ని తానే అని చెప్పుకోగల డేరింగ్ క్యారక్టర్. అలాంటి అయ్యన్న దూకుడుగా ఉంటారు. దేన్ని లెక్క చేయరు. అయితే ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఏంటి అన్నది దాని మీదనే ఇపుడు పార్టీలో చర్చ సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు నర్శీపట్నం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది తమ్ముళ్లను వేధిస్తున్న ప్రశ్న. అయ్యన్న వరకూ చూసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 67 ఏళ్ళు నిండుతాయి. రాజకీయంగా చూస్తే అదేమీ పెద్ద వయసు కాదు, ఆయనలో ఇంకా స్టామినా ఉంది. మరో టెర్మ్ గెలిచి పార్టీ పవర్ లోకి వస్తే మంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించే నేర్పు ఉంది.

అయితే అయ్యన్నపాత్రుడు పోటీ చేయడానికి అడ్డంకి ఏంటి అంటే ఆయన కుమారుడే అన్న మాట వినిపిస్తోంది. ఇది నిజమేనా అంటే పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయని చెబుతున్నారు. అయ్యన్న వారసుడిగా విజయ్ పాత్రుడు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి వెనకాల ఉంటూ టీడీపీ విజయానికి ఎంతో పాటు పడిన నేతగా విజయ్ గుర్తింపు పొందారు.

అయితే విజయ్ పాత్రుడికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. అది కూడా శాసనసభ్యుడిగానే. తండ్రి ఇలాకా అయిన నర్శీపట్నం నుంచే అరంగేట్రం చేయాలని చూస్తున్నారు. అయితే అయ్యన్నపాత్రుడు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కుమారిడిని ఎంపీగా చూడాలన్నది ఆయన కోరిక. విజయ్ పాత్రుడు ఉన్నత చదువులు అభ్యసించారు. నాలుగైదు భాషలు వచ్చు. అందువల్ల ఆయన ఢిల్లీలో తన వాణిని గట్టిగా వినిపించాలన్నది అయ్యన్న ఆకాక్ష.

ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక చానల్ ఇంటర్వ్యూలో అయ్యన్న స్వయంగా చెప్పారు. అయితే కుమారుడు మాత్రం ఎమ్మెల్యేగానే బరిలోకి దిగాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఆయన టీడీపీ యువ నేత లోకేష్ టీమ్ లో ఉన్నారు. ఈ యంగ్ బ్యాచ్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని కూడా ప్రచారంలో ఉంది. అయితే చంద్రబాబు మాత్రం అయ్యన్నపాత్రుడికే ఓటు వేస్తారని కూడా అంటున్నారు.

నర్శీపట్నం టీడీపీకి కంచుకోట అయినా ఇపుడు అక్కడ సీన్ మారింది. వైసీపీ గట్టిగా ఉంది. పైగా అయ్యన్న పట్లూ వ్యూహాలు తెలిసిన ఒకనాటి శిష్యుడు పెట్ల ఉమాశంకర్ ఇపుడు నర్శీపట్నం ఎమ్మెల్యే. ఆ మధ్యకాలంలో తమ్ముడు సన్యాసిపాత్రుడు కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ కోటకు అక్కడ కొంత బీటలు వారిన నేపధ్యం ఉంది. అయితే అయ్యన్న వంటి సీనియర్ బరిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో కధే వేరుగా ఉంటుంది అంటున్నారు. దాంతో చంద్రబాబు మాత్రం ఆయనకే టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది.

కానీ కుమారుడు పట్టుపడితే మాత్రం అయ్యన్న తప్పుకోవచ్చు అని కూడా టాక్ ఉంది. మొత్తానికి అయ్యన్న రాజకీయ జీవితానికి అసలైన అడ్డంకి ఎవరూ అంటే ఆయన పేరే చెప్పాలేమో. చూడాలి మరి చంద్రబాబు సర్దిచెప్పి వ్యవహారాన్ని సెట్ చేస్తే మాత్రం అయ్యన్న ఎమ్మెల్యేగా, విజయ్ ఎంపీగా బరిలోకి దిగడం ఖాయం.