Begin typing your search above and press return to search.

పిల్లాడి గడియారం వైట్ హౌస్ కి వెళ్లనుంది

By:  Tupaki Desk   |   20 Sep 2015 3:34 AM GMT
పిల్లాడి గడియారం వైట్ హౌస్ కి వెళ్లనుంది
X
ఒక స్కూల్ విద్యార్థికి అపురూపమైన ఆహ్వానం అందింది. పిల్లల్లోని సృజనాత్మకతను మరింత పెంచటమే కాదు.. అలాంటి ప్రయత్నం చేసిన వారిని అభినందించే ధోరణి ప్రపంచ పెద్దన్న అమెరికాకు కాస్త ఎక్కువే. ఒక స్కూలు కుర్రాడు తయారు చేసిన డిజిటల్ క్లాక్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉత్సుకత ప్రదర్శించటం విశేషం.

ఒక స్కూలు విద్యార్థి తయారు చేసిన ఒక డిజిటల్ గడియారం అమెరికా అధ్యక్షుడికి ఎలా తెలిసింది? ఆయన దాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నారన్న విషయానికి వెళితే దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది.

సూడాన్ కు చెందిన పద్నాలుగేళ్ల అహ్మద్ మొహ్మద్ టెక్సాస్ లోని ఇర్వింగ్ లోని ఒక పాఠశాల విద్యార్థి. ఇంజనీర్ కావాలన్నది అతడి కోరిక. పెన్సిల్ బాక్స్ తో అతనో డిజిటల్ గడియారాన్ని తయారు చేశాడు. దాన్ని టీచర్ కు చూపిస్తే.. ఆమె దాన్నో బాంబుగా భావించి.. అతడ్ని గదిలో బంధించటమే కాదు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారం కాస్త మీడియాలో రావటంతో రచ్చ పెరిగి పెద్దదైంది.

పాఠశాలతో పాటు.. అందులో పని చేస్తున్న ఉపాధ్యాయులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తటంతో విషయం వైట్ హౌస్ వరకూ వెళ్లింది. దీనిపై స్పందించిన ఒబామా.. సదరు కుర్రాడు తయారు చేసిన గడియారాన్ని వైట్ హౌస్ కి తీసుకురావాలని.. దాన్ని తాను చూడాలని భావిస్తున్నట్లుగా ఫేస్ బుక్.. ట్విట్టర్ లో ప్రకటించటంతో ఇష్యూ కాస్త వేడి తగ్గటమే కాదు.. ఒబామా వైఖరిపై హర్షం వ్యక్తమవుతోంది. మరి.. వైట్ హౌస్ కి మొహ్మద్ డిజిటల్ క్లాక్ ఎప్పుడు వెళుతుందో చూడాలి.